CM Jagan Comments In Kavali Meeting: ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్న ఎన్నికలని.. పేదల పక్షాన మీ బిడ్డ ఉంటే, పెత్తందార్ల పక్షాన చంద్రబాబు ఉన్నారని సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలిలో (Kavali) నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారని.. అలాంటి వ్యక్తికి, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు యుద్ధమని పేర్కొన్నారు. 'ఈ యుద్ధంలో మీ బిడ్డ ఎప్పుడూ పేదల పక్షమే. మోసగాళ్లంతా కుట్రలు చేస్తున్నారు. అందరి ప్రయోజనాలు రక్షించుకునేందుకు, మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు మీరంతా సిద్ధం కావాలి. పేదల భవిష్యత్ నిర్ణయించేది ఈ ఎన్నికలే.' అని జగన్ తెలిపారు.






'ఆ ధైర్యం ఉందా.?'






మూడుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే పేదలకు మంచి చేసిన ఒక్క పథకం కూడా గుర్తు రాదని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 'మేనిఫెస్టో కాపీలు చూపించే దమ్ము, ధైర్యం ఆయనకు లేవు. మేనిఫెస్టోలో 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా.?. ఎన్నికలొస్తే ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు ముందుకు వస్తారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే పొత్తు ఎందుకు.?. బెంజ్ కారు, బంగారం ఇస్తామంటూ చెప్తారు. నా ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేరు. ఐదేళ్లలో పేదలందరికీ మంచి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నాం. నాడు - నేడుతో స్కూళ్లు, ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి చూపించాం. ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని నేరుగా అందించాం. రూ.2.70 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలల పాటు అందరికీ సంక్షేమం అందేలా చర్యలు చేపట్టాం. 99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ ఆశీర్వదించాలని కోరుతున్నా. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తల పెట్టడమే. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి కొనసాగుతుంది. సూపర్ సిక్స్ అంటూ వస్తోన్న చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దు.' అని జగన్ పిలుపునిచ్చారు.













Also Read: YSRCP News : షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్ - సజ్జల తీవ్ర విమర్శలు