Dokka Manikya Vara Prasad joining the Congress :  వైసీపీలో  టిక్కెట్లు దక్కని  దళిత నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు  ఆర్థర్, ఎలీజా, ఎం.ఎస్ బాబు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మరో దళిత నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.  


వైసీపీలో ప్రాధాన్యం దక్కని డొక్కా 
 
గుంటూరు వైసీపీ అధ్యక్షుడిగా వ్యవహిస్తున్న  మాజీ మంత్రి డొక్కా మానిక్యవరప్రసాద్‌కు ఆ పార్టీలో గుర్తింపు లేదు. కనీసం ఎవరూ ప్రచారానికి కూడా పిలవడం లేదు. కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్రలో పార్టీలో తన పరిస్థితిపై తానే బాధపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని.. ఒక్క సారి జగన్‌ను కలిపించాలని ఆయన వేదికపై ఉన్న నేతల్ని వేడుకున్నారు. ఆ తర్వాత నుంచి ఆయనను మరింతగా దూరం పెట్టారు. 


సీనియర్ దళిత నేతగా గుర్తింపు


2004లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాడికండ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన ఆయన  విభజన అనంతర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు.   2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డొక్కా వరప్రసాద్ ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆయన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అనూహ్యంగా మూడు రాజధానుల బిల్లు సమయంలో ఆయన పార్టీ కండువా మార్చి వైసీపీలో చేరిపోయారు. అప్పుడే టీడీపీ తరపు ఎమ్మెల్సీగా రాజీనామా చేసి వైసీపీ తరపు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.   


వైసీపీలో మొదట ప్రాధాన్యం ఇచ్చి తర్వాత పట్టించుకోని నేతలు


 2024 ఎన్నికల్లో టికెట్ వస్తుందని ఆశపడిన డొక్కాకు నిరాశే ఎదురైంది. దీంతో పార్టీ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లో కీలకంగా మెలిగిన డొక్కా.. ఇప్పుడు సీటు దక్కకపోగా పార్టీలోనూ ప్రాధాన్యత లోపిస్తుండటంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని వాదన వినిపిస్తోంది.  డొక్కాను వదులుకుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీపై అది ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందువల్ల డొక్కాను పార్టీలోనే ఉంచేలా వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది.  


డొక్కాను బుజ్జగిస్తున్న వైసీపీ                           


డొక్కా పార్టీ వీడుతున్నారన్న ప్రచార ప్రారంభం కాగానే   మంత్రి అంబటి రాంబాబు.. డొక్కాతో సమావేశమయ్యారు. గుంటూరు లోని డొక్కా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన పార్టీ మారవద్దని  కోరినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లుగాగాచెబుతున్నారు. డొక్కా మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో సంబంధం లేదన్నారు. అయితే గౌరవం లేని చోట ఉండటం ఎందుకని.. కాంగ్రెస్ లో చేరితే బెటరని ఆలోచిస్తున్నారని అంటున్నారు.