Beni-koji Health Supplement: ఓ డ్రగ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చే ముందు సరైన టెస్టింగ్ జరగకపోతే ఎలాంటి దారుణం జరుగుతోందో తాజాగా జపాన్ లో జరిగిన ఓ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఈ మందును తీసుకున్న చాలా మంది హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే పరిస్థితి విషమించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జపాన్ సర్కారు సీరియస్ అయ్యింది. సదరు డ్రగ్ తయారు చేసిన సంస్థపై విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ డ్రగ్ ను రీకాల్ చేసినట్లు సదరు ఫార్మాసూటికల్ సంస్థ వెల్లడించింది.  


డ్రగ్ వికటించి ఐదుగురు మృతి, పలువురికి సీరియస్


జపాన్ లోని ఒసాకాకు చెందిన కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ రీసెంట్ గా బెని కోజీ అనే మెడిసిన్ ను తయారు చేసింది. బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ మాత్రను రూపొందించింది. మూడు సంవత్సరాల క్రితమే ఈ డ్రగ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే, తాజాగా బెని కోజి ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నకొందరు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 100 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


విచారణకు ఆదేశించిన జపాన్ సర్కారు


నిజానికి ఈ ఘటన జనవరిలోనే జరిగినా, మార్చి వరకు కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్చి 22 వరకు దీనిపై కంపెనీ స్పందించలేదు. అయితే. ఈ మందు తీసుకున్న వారిలో కిడ్నీ సంబంధ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వారందరిలో కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై జపాన్ మెడికల్ అధికారులు ఎంక్వయిరీ జరుపుతున్నారు. కోబయాషి ఫార్మాస్యూటికల్ సంస్థ ఈ ఘటనకు సంబంధించి వీలైనంత త్వరగా నివేదిక అందజేయాలని జపాన్ ఆరోగ్య మంత్రి నూనున్ ఆదేశించారు. ఈ మందుల వల్ల కలిగిన నష్టం గురించి దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించాలని అధికారులకు సూచించారు.


ప్రజలకు క్షమాపణ చెప్పిన కొబయాషి ఫార్మాస్యూటికల్ సంస్థ


అటు బెని కోజీతో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన పొరపాటుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ వెల్లడించారు. ఇప్పటికే బెని కోజీ డ్రగ్ ను పెద్ద మొత్తంలో రీకాల్ చేసినట్లు తెలిపారు. కొబయాషి ఫార్మాస్యూటికల్ కంపెనీ కొన్నేళ్లుగా బెని కోజీ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తోంది. గడిచిన మూడు సంవత్సరాల్లో లక్షల కొద్దీ డ్రగ్ మాత్రలను అమ్మింది. 2023లో ఉత్పత్తి చేసిన సప్లిమెంట్‌లలో సమస్య కారణంగానే ఈ దారుణం జరిగినట్లు కంపెనీ తెలిపింది. గత ఏడాది మొత్తం 18.5 టన్నుల బెని కోజీని మార్కెట్ లోకి తీసుకొచ్చినట్లు వివరించింది. మరోవైపు ఈ ఘటనలో కోబయాషి ఫార్మాసూటికల్ కంపెనీ భారీగా నష్టపోయింది. సంస్థకు చెందిన షేర్లు భారీగా పడిపోయాయి.  


Read Also: భూమిని చీల్చుకుని పుడుతోన్న మరో మహా సముద్రం - ఆ దేశంలో భారీ పగుళ్లు, మరో ఖండం ఏర్పడనుందా?