ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతీ రోజూ నివేదిక తెప్పించుకుని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎఆర్ఎల్‌పీ సమావేశంలో స్పష్టం చేశారు. ఇక నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పార్టీ విజయం సాధించినప్పుడు తొలి సారి వైఎస్ఆర్‌ఎల్పీ మీటింగ్ జరిగింది. దాదాపుగా మూడేళ్ల తర్వాత మరోసారి ఎల్పీ మీటింగ్‌ను సీఎం జగన్ నిర్వహించారు.ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గత రెండున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నామని జగన్ వారికి తెలిపారు. 


బూత్ కమిటీల్ని బలోపేతం చేయండి !


ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల అమలు విషయంలో పూర్తి స్థాయిలో లబ్దిదారులతో మమేకం అవ్వాలని జగన్ స్పష్టం చేశారు. గ్రామ  సచివాలాయలను సందర్శించాలని.. కనీసం నెలకు పది గ్రామ సచివాలాయలను సందర్శించి... పనితీరును పరిశీలించాలన్నారు. సంక్షేమ పథకాల అమలలో ఎక్కడ లోపాలు ఉన్నా తక్షణం సరి చేయాలన్నారు. పార్టీ బూత్ కమిటీల విషయంపై సీఎం జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. బూత్ కమిటీల్ని తక్షణం బలోపేతం చేయాలన్నారు. ఆ కమిటీల్లో సగం మంది మహిళలకు చాన్సివ్వాలని సూచించారు. 


గడప గడపకూ వెళ్లి పథకాల ప్రచారం చేయండి !


గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఈసందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్లులన్నిటినీ ఏప్రిల్‌లోగా క్లియర్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నియోజకవర్గానికి రూ. రెండు కోట్ల చొప్పున నిధులు ఇచ్చేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించామని అవి కూడా ఏప్రిల్‌ నుంచి ఇచ్చే అవకాశం ఉందని తెలిపినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు గడపగడపకూ వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. దీని కన్నా ప్రభావంతమైన కార్యక్రమం ఏదీ ఉండదన్నారు. 


మంత్రి పదవులు దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదు !


మంత్రివర్గ ప్రక్షాళనపై కూడా సీఎం జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఎమ్మెల్యేలకు తెలిపారు. మంత్రి పదవి దక్కకపోతే పక్కన పెట్టినట్లు కాదని జగన్ ఆశావహులను అనునయించే ప్రయత్నం చేశారు. సమర్థులైన వారికి పార్టీ  బాధ్యతలు, జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తామన్నారు. మళ్లీ అవకాశాలు వస్తాయని.. ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.  26 కొత్త జిల్లాలకు అధ్యక్షుల్ని నియమిస్తామన్నారు. సామాజిక సమీకరణాల వల్ల కొన్ని మినహాయింపులు మంత్రివర్గ విస్తరణలో ఉంటుందని జగన్ తెలిపారు. అంటే.. కొంత మందిని కొనసాగించబోతున్నారని ఎమ్మెల్యేలు ఓ అంచనాకు వచ్చారు.  2024 ఎన్నికలే లక్ష్యంగా పని చేయాలని పదే పదే ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రభుత్వ పరంగా నిధుల వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  


మంత్రివర్గ విస్తరణ ప్లీనరీ తర్వాతేనా ?


ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఉంటుందని చెప్పారు కానీ ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు. ప్లీనరీ సహజంగా జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా నిర్వహిస్తూ ఉంటారు.  ఈ సారి కూడా అప్పుడే నిర్వహిస్తారు. ఆ ప్లీనరీ అయిపోయిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న సంకేతాలను సీఎం జగన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఆశావహులకు షాక్ తగిలినట్లయింది.