భారతీయ జనతా పార్టీ రోడ్  మ్యాప్ ఇస్తానందని.. అదు కోసమే వెయిటింగ్ అంటూ జనసేన ఆవిర్భావ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ చర్చ ప్రారంభమయింది. అసలు బీజేపీ ఇస్తానన్న రోడ్ మ్యాప్ ఏంటి ? ఎందుకు ఆ రోడ్ మ్యాప్ ? పొత్తుల కోసమా ? లేకపోతే వైసీపీని ఓడించడానికా ? పొత్తులు పెట్టుకుని వైసీపీని ఓడించడానికా ? . వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పవన్ కల్యాణ్ ప్రకటించిన సందర్భంలో రోడ్ మ్యాప్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఈ అంశంలోనే అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఈ అంశంలో భిన్నంగా స్పందిస్తున్నారు. 


బీజేపీ ఒక్క పార్టీతోనే కలిసి వెళ్తామని చెప్పని పవన్ కల్యాణ్  !


ఏపీలో భారతీయ జనతాపార్టీకి ఒక్క శాతం కూడాఓటు బ్యాంక్ లేదు. పవన్ కల్యాణ్‌కు ఆరు శాతం వరకూ ఓటు బ్యాంక్ ఉంది. గత ఎన్నికల్లో వారికి వచ్చినఓట్ల శాతాన్ని బట్టి ఈ ఓటు బ్యాంకు లెక్కలు వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని..తాము బలపడ్డామని..  కలిసి అధికారంలోకి వచ్చేస్తామని ఈ రెండు పార్టీలు బలంగా చెప్పలేకపోతున్నాయి. పైకి చెప్పినా.. వాటిని ఎవరూ సీరియస్‌గా తీసుకోవడంలేదు. తిరుపతి ఉపఎన్నికల్లో చూసినా.. బద్వేలులో టీడీపీ బరిలోలేకపోయినా బీజేపీకి వచ్చిన ఓట్లను చూసినా..అలాగే స్థానిక ఎన్నికల ఫలితాలు చూసినా బీజేపీ పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. కానీ జనసేన మాత్రం కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపించింది. అందుకే పవన్ కల్యాణ్ వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి బీజేపీతో మాత్రమే వెళ్తానని బలంగా చెప్పడం లేదు. అదే సమయంలో ఓట్లు చీలకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. 


రోడ్ మ్యాప్ ఎప్పుడో ఇచ్చేశారంటున్న ఏపీ బీజేపీ !


ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. రోడ్ మ్యాప్ రెండు నెలల క్రితమే తమకు ఇచ్చారని చెబుతున్నారు. అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడే పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో రోడ్ మ్యాప్ ఇచ్చారని విశాఖలో సోము వీర్రాజు ప్రకటించారు.  2024 లోనే మేము అధికారంలోకి రావాలని జనసేనతో కలిసి ముందుకెళ్లే అంశంపై స్పష్టమైన సంకేతాలు మాకు అందాయని చెప్పుకొచ్చారు.  ఆ దిశా నిర్దేశం ప్రకారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటుంటూ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామన్నారు.  రానున్న  రోజుల్లో  జనసేనతో కలిసి ఉద్యమాలను ఉదృతం చేసి అధికార పార్టీ కంటిపై కునుకు లేకుండా ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు.  పవన్ కళ్యాణ్ గారు మా మిత్ర పార్టీ అధ్యక్షులు. వారితో మా కేంద్ర పార్టీ ప్రతినిధులు అన్ని విషయాలు  మాట్లాడాతారన్నారు.  బిజెపి-జనసేన మైత్రి మరింత బలపడుతుందని సోము వీర్రాజు చెబుతున్నారు.  
 


బీజేపీ రోడ్ మ్యాప్ సరే జనసేనకు ఇస్తామన్న రోడ్ మ్యాప్ ఏంటి ?


ఏపీ బీజేపీ నేతలు తమకు రోడ్ మ్యాప్ అందిందని చెబుతున్నారు. అయితే అది వారి పార్టీకి సంబంధించిన రోడ్ మ్యాప్ కావొచ్చు. వైఎస్ఆర్‌సీపీని దింపేయడానికి.. ఓట్లు చీలకుండా ఏం చేయాలో ఇప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సి ఉంది. ఓట్లు చీలకూడదు అంటే విపక్షాలను కలుపుకుని పోవాలి. అంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లాలి. ఈ విషయంలో బీజేపీ నుంచి  ఎలాంటి రోడ్ మ్యాప్ వస్తుందనేదానిపై పవన్ కల్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. 


ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి కనిపిస్తోంది. ఎన్నికల సందడి ప్రారంభమైంది. విపక్షాలను గుక్కతిప్పుకోనియకుండా చేయడానికి ఏ క్షణమైనా వైఎస్ జగన్ఎన్నికలకు వెళ్లవచ్చని విపక్షాలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన రోడ్ మ్యాప్ ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. ఈ రోడ్ మ్యాపే వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా కీలకం అయ్యే అవకాశం కనిపిస్తోంది.