నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ... తెలంగాణపై ఫోకస్ చేసినట్టు ఆ రాష్ట్రనేతలు చెబుతున్నారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ గ్రోత్‌ పరిగెడుతుందని కామెంట్స్ చేశారు. కచ్చితంగా రాష్ట్రంలో అధికారం సాధిస్తామని మీడియా సమావేశాలు పెట్టారు. 


తెలంగాణ బీజేపీ లీడర్స్ చేస్తున్న నినాదానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్‌పై మాట్లాడిన కేంద్ర విధానాలపై దుమ్మెత్తి పోశారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్రం అనుసరిస్తోందని మండిపడ్డారు. 


తెలంగాణలో ఉన్న మంచి ఎకో సిస్టాన్ని దెబ్బ తీసేలా కొందరు పిగ్మీ నాయకులు తయారయ్యారని మండిపడ్డారు కేసీఆర్. వివిధ రాష్ట్రాల నుంచి వేల మంది వచ్చి హైదరాబాద్‌లో బతుకుతున్నారనిఅలాంటి వాతావరణాన్ని చెడగొట్టేలా కొందరి ప్రవర్తన ఉందన్నారు కేసీఆర్. 


వాళ్ల ఆటలు ఇక్కడ సాగవన్న కేసీఆర్... ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోనే చాలా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా ఉందని గుర్తు చేశారు. తాము చెబుతున్న లెక్కలు కేంద్రం విడుదల చేసినవేనంటూ వివరించారు. 
 
దేశ తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉందన్నారు కేసీఆర్. నీతి ఆయోగ్‌ వెలువరించిన డేటాలో ప్రకారం శిశుమరణాల రేటు భారీగా తగ్గిందన్నారు. ఒకప్పుడు ఈ మాతా శిశుమరణాల రేటు నియంత్రణలో తమిళనాడు టాప్‌లో ఉండేదని ఇప్పుడు తెలంగాణ వచ్చిందని చెప్పారు.  ఎంఎంఆర్‌ తమిళనాడు ప్రస్తుతం 58 ఉంటే తెలంగాణలో 56 ఉందన్నారు. 


తెచ్చిన అప్పులు జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామన్నారు కేసీఆర్‌. తెచ్చిన అప్పులను ఠంచనగా తిరిగి చెల్లిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు కేసీఆర్. తెలంగాణకు చెందిన 40 ఏళ్ల బాండ్స్‌ కూడా  అమ్ముడుపోతున్నాయన్నారు. 


డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ ఈ మధ్య చాలా మంది కామెంట్స్ చేస్తున్నారని దీని సంగతి కూడా చూద్దామంటూ కేసీఆర్ లెక్కలతో వివరించారు.  కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉండాలన్న నినాదమే ఈ డబుల్ ఇంజిన్ గ్రోత్‌ అని చెప్పారు. 


బీజేపీ అధికారంలో ఉన్న, డబుల్ ఇంజిన్ నడుస్తున్న  ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న పరిస్థితి కేసీఆర్ వివరించారు. తెలంగాణలో తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల రూపాయలు ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో తలసరి ఆదాయం 71వేల రూపాయలు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల తలసరి ఆదాయంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ర్యాంకు చివరి నుంచి రెండో స్థానమని ఎద్దేవా చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు ట్రుబుల్ ఇంజిన్ గ్రోత్ అన్నారు కేసీఆర్
 
ఉత్తర్‌ప్రదేశ్‌ ఆర్థిక వృద్ధి రేటు 7.26 ఉందన్న ఆయన.. తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు 10.8 శాతమని గుర్తు చేశారు కేసీఆర్.  ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017-21లో వృద్ధి రేటు 25.69 శాతం ఉంటే... తెలంగాణలో 55.46 శాతమని తెలిపారు. యూపీలో ఎంఎంఆర్‌లో 167 ఉంటే తెలంగాణలో 56 శాతం ఉందన్నారు. శిశుమరణాల రేటు నియంత్రణలో కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో తెలంగాణకు పోటీ కాదన్నారు. అక్కడ 41 ఉంటే ఇక్కడ 23 అన్ని తెలిపారు కేసీఆర్.


డబుల్ ఇంజిన్ గ్రోత్ లాంటి నినాదాలు, మత పిచ్చి, రాష్ట్రాల హక్కులు హరించే విధానం, సంస్కరణల పేరిట జరిగే మాయాజాలాన్ని తట్టుకొని తెలంగాణం అద్భుతాలు సాధిస్తుందన్నారు కేసీఆర్. అందర్నీ కలుపుకొని మరిన్ని విజయాలు సాధిస్తామన్నారు.