Telangana Budget Sessions: ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరిగే చర్చలు కూడా ఇంప్రూవ్ కావాలని, భవిష్యత్‌లో దేశాన్ని రాష్ట్రాన్ని నడిపే నాయకత్వం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ద్ర‌వ్య వినిమయ బిల్లు ప్ర‌వేశ పెట్టారు. అసెంబ్లీ చివరిరోజు సభలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం మాట్లాడుతూ.. అన్న వస్త్రం కోసం ప్రయత్నిస్తే ఉన్న వస్త్రం పోయినట్టు కేంద్రం దుస్థితి ఉందని ఎద్దేవా చేశారు కేసీఆర్. యూపీఏ పాలన బాగాలేదని ప్రజలు ఎన్‌డీఏకు ఓటు వేస్తే వీళ్లు నిండా ముంచేశారన్నారు. దీనికి కరోనా మాత్రమే కాదన్నారు. కేంద్ర రాష్ట్రం పనితీరు బాగుంటేనే దేశ ఆర్థిక పరిస్థితి బాగుటుందన్నారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు కేసీఆర్. 16 శాతం గ్రోత్ ఉంటేనే అది సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే కాదన్నారు. 


ఆ విషయాలు చాలా దారుణం.. 
రాజకీయాల్లో పెడధోరణలు కనిపిస్తున్నాయన్నారు కేసీఆర్. ఇప్పుడు ఎఫ్‌ఆర్‌బీఎం రాష్ట్రాలకు ఉన్నది 3.5 శాతమే ఉందన్నారు. విద్యుత్ సంస్కరణలు చేపడితేనే మరో పాయింట్‌ ఐదు శాతం ఇస్తామంటున్నారని మండిపడ్డారు. కానీ అవి చాలా దారుణంగా ఉంటుందన్నారు. తెలంగాణ రైతులకు చాలా మేలు చేస్తున్నామన్నారు. కరెంటు ఉచితంగా ఇస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కూడా చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు కూడా మళ్లీ పల్లెలకు వెళ్లి వ్యవసాయం చేస్తున్నారన్నారు.  


వ్యవసాయ స్థిరీకరణ జరగాలన్న ఉద్దేశంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. కానీ కేంద్రం వాటికి మీటర్లు పెట్టాలని చెబుతుందన్నారు. తాము పెట్టబోమన్నారు కేసీఆర్. దీని వల్ల కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులు కోల్పోతున్నామన్నారు. 


దేశంలో మత పిచ్చి పెరిగిందా ! 
దేశంలో పెరిగింది మత పిచ్చి అన్నారు కేసీఆర్. ఇది దేశానికి మంచిది కాదన్నారు. 20వేల మందికిపైగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. వీళ్లంతా వైద్యవిద్యను చదివేందుకు వెళ్లారన్నారు. తెలంగాణలోని 700 మంది ఉక్రెయిన్‌కు వెళ్లారన్నారు. ఇప్పుడు వాళ్ల భవిష్యత్‌ ఏంటో తెలియడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున భరోసా కల్పిస్తున్నాం. ఎంత ఖర్చైనా భరిస్తామన్నారు కేసీఆర్ (KCR About Ukraine Return MBBS Students). ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామన్నారు.


కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ ఎందుకెళ్లారు ? (Union Ministers Went To Ukraine)
విద్యార్థులు తీసుకురావడానికి కేంద్రమంత్రులు ఎందుకెళ్లారని నిలదీశారు కేసీఆర్. తిన్నది అరక్క వెళ్లారా అంటూ కేంద్రమంత్రులు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని అడిగారు. దేశంలో మతోన్మాదం, మూక దాడులు పెరిగిపోతున్నాయన్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఉద్యోగాలు కూడా రాకుండాపోతుందన్నారు. ఇవాళ పదకొండు రాష్ట్రాల వాళ్లు హైదరాబాద్‌లో బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఉన్మాదులు వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కేసీఆర్. తెలంగాణ కంటే కేంద్రం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 


మెప్మా, ఐకేపీ, సెర్ప్‌లో పని చేసే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సమానమైన వేతనాలు ఇస్తామన్నారు కేసీఆర్. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అందర్నీ మళ్లీ  విధుల్లోకి తీసుకుంటామన్నారు. వాళ్లేదో పొరపాటు చేశారని సభ్యుల అభ్యర్థన మేరకు వాళ్లకు న్యాయం చేస్తామన్నారు. 


ప్రతి బడ్జెట్‌లో జరిగేది ఇదే.. 
బడ్జెట్‌ అంటే బ్రహ్మపదార్థం అన్నట్టు మన దేశంలో ఉంటుంది. ఇందులో రెండు విషయాలు గమనించాలి. అధికారం ప్రవేశపెడితే... అధికార పక్షం పొగుడుతూ ఉంటుంది. ప్రతిపక్షం తిడుతుంది. దశాబ్దాలుగా నడుస్తున్నది ఇదే. సీట్లు మారినప్పుడు ఇదే ధోరణి.  వాళ్లకు ఇవి చాలా ఉపయోగపడతాయి. కొన్ని అలవాట్లు వచ్చేశాయి. ఎఫ్‌ఆర్‌బీఎంపై ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పాలసీ చాలా విచిత్రంగా ఉంటోంది. బలమైన కేంద్రం బలహీనమైన రాష్ట్రాలు అన్నట్టు కేంద్రం పాలిస్తోంది. ఇది భవిష్యత్‌లో అనేక సమస్యలకు దారి తీస్తుందన్నారు కేసీఆర్.


బడ్జెట్ గురించి టెన్షన్ వద్దు.. 
బడ్జెట్ అనేది నిధుల కూర్పు అని తెలుసుకోవాలి. సమకూరిన నిధులు ఎలా ఖర్చుపెట్టాలన్నదే డిస్కషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అదే దారిలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మన మొదటి బడ్జెట్‌ వంద కోట్లు. ప్రైవేటు బడ్జెట్‌ బ్యాంకు బ్యాలెన్స్‌, ఆదాయంపై అది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్‌ అలా కాదు. మొదట ప్లాన్ వేస్తారు. వివిధ శాఖలకు ఎంత ఖర్చు పెట్టాలనే లెక్కలు రెడీ చేస్తారు. ఆ లెక్క ప్రకారమే నిధులు కూర్పు జరుగుతుందని పేర్కొన్నారు.


తెలంగాణ అద్భుతాలు సాధిస్తోంది 
చాలా అంశాల్లో తెలంగాణ రాష్ట్ర అద్భుతాలు సాధిస్తోందని ఆర్బీఐ చెబుతోందన్నారు కేసీఆర్. ఆర్థిక క్రమశిక్షణతో 28 రాష్ట్రాల్లో తెలంగాణ 25 స్థానంలో ఉందన్నారు. అంటే చాలా తక్కువ అప్పులు చేస్తున్నామన్నారు. దానిపై పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని బట్టి విక్రమార్కకు సూచించారు కేసీఆర్. విత్తవిధానాన్ని నియంత్రించేది కేంద్రమే అన్నారు. వాళ్ల అడుగు జాడల్లోనే మనం నడవాల్సి వస్తోంది. కొన్ని విషయాల్లో మాత్రమే మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తోంది. అక్కడ గొప్పగా ఉంటేనే రాష్ట్రాల్లోనూ మార్పు వస్తుందన్నారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్రాలు ఆలోచించుకోవాలన్నారు.


రాష్ట్రాల ఉనికే లేకుండా చేస్తామంటూ కేంద్ర విధానాలు ఉన్నాయి. కేంద్రం పనితీరు తెలంగాణ కంటే దారుణంగా ఉంది. ఇందులో దాచడానికి ఏమీ లేదు. కేంద్రమే ఈ విషయాన్ని చెబుతోంది. తలసరి ఆదాయం, జీడీపీ చూసినా ఎక్కడ కూడా తెలంగాణతో కేంద్రానికి పోలికే లేదు. వాళ్లు అప్పులు 58.5 శాతనికి మించి తీసుకున్నారు. 152 లక్షల కోట్లు దేశం అప్పు. రాష్ట్రాలకు 25శాతానికి మించడం లేదు. వాళ్లకు నచ్చినట్టు చేస్తారు రాష్ట్రాలను తొక్కి పెడుతున్నారు. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నారు.


ఐదు హెక్టార్ల వరకు అటవీ భూమి రాష్ట్రాలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఒక్క హెక్టార్‌కు పరిమితం చేసింది కేంద్రం. దీనిపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి విధానాలను ముక్తకంఠంతో అన్ని రాష్ట్రాలు ఖండించాలన్నారు కేసీఆర్