ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు డాక్ట‌ర్ చెరుకు సుధాక‌ర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... 


మ‌న ఇంట్లో పుట్టిన కూత‌రికి పెళ్లి చేయాలంటే ఎంతో ఆలోచిస్తాం.. ఇచ్చే వ్య‌క్తి మంచొడా..? కాదా..? అని ఆలోచిస్తాం అని కేటీఆర్ తెలిపారు. ఒక‌టికి ప‌దిసార్లు చెడు వ్య‌స‌నాలు ఏమైనా ఉన్నాయా? అని ఆలోచిస్తాం. మ‌నింటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటేనే ప‌ది సార్లు ఆలోచించే మ‌నం.. ఇంత కఫ‌ష్ట‌ప‌డి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవ‌రి చేతుల‌ పెట్టాల‌నేట‌ప్పుడు ఆలోచించుకోవాల్నా..? వ‌ద్దా..? అని కేటీఆర్ అడిగారు.


46 రోజుల పాటు కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి, జైలు శిక్ష అనుభవించిన చెరుకు సుధాకర్ సహా, జిట్టా బాలకృష్ణ, ఏపురు సోమన్న, హర్ దీప్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో చేరడం గొప్ప విషయం అని కేటీఆర్ అన్నారు. న‌ల్ల‌గొండ జిల్లాలో 12కు 12 స్థానాల్లో బ్ర‌హ్మాండ‌మైన మెజార్టీతో గులాబీ జెండా ఎగుర‌త‌ద‌నే సంపూర్ణ‌మైన విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న‌వారి వ‌ద్ద కూడా చ‌ర్చ పెట్టండి. తెలంగాణ ఎలా అభివృద్ధి చెందిందో వివ‌రించండి. అడ్వాన్స్‌గా విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు తెలియజేస్తూ.. మంచి విజ‌యం న‌ల్ల‌గొండ జిల్లాలో రావాల‌ని కోరుకుంటున్నాను అని కేటీఆర్ అన్నారు.


సుధాక‌ర్ అన్న సొంతింటికి రావ‌డం సంతోషంగా ఉందన్నారు హ‌రీశ్‌రావు. తెలంగాణ ఉద్య‌మంలో అగ్ర‌భాగంలో ఉండి, క‌రుడుగ‌ట్టిన ఉద్య‌మ‌కారుడిగా ప‌ని చేశారు. తెలంగాణ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ‌వారు. ఇవాళ బాగా ఆలోచించి ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయ‌క‌త్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని న‌మ్మి, మూడోసారి కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావాల‌నే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీలో చేరార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.


ఉద్య‌మ‌కారుల‌పై తుపాకీ గురి పెట్టిన వ్య‌క్తి.. ఉద్య‌మ ద్రోహి రేవంత్ రెడ్డి అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డేమో ఉద్య‌మ స‌మ‌యంలో రాజీనామా చేయ‌కుండా పారిపోయారు. వెన్నుచూపి పారిపోయిన వ్య‌క్తి కిష‌న్ రెడ్డి. త‌న ప్రాణాన్ని సైతం ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డ నేత కేసీఆర్ అని తెలిపారు.


నిన్న మొన్న రాహుల్ గాంధీ వ‌చ్చిండు. బీజేపీకి వ్య‌తిరేకండ‌గా పోరాడడ‌మే నా డీఎన్ఏలో ఉన్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. రేవంత్ రెడ్డి డీఎన్ఏలో ఏమున్న‌దో క‌నుక్కోండి. ఏబీవీపీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉన్న‌దా..? బీఆర్ఎస్ ఉన్న‌దా..? కాంగ్రెస్ ఉన్న‌దా..? ఆయ‌న డీఎన్ఏలో ఏమున్న‌ద‌ని అడుగుతున్నాన‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఎన్ని పార్టీలు మారిండు ఆయ‌న‌. మీ డీఎన్ఏ, ఆయ‌న డీఎన్ఏ మ్యాచ్ అవుత‌ద‌లేదు. అది స‌రి చేసుకోండి. ఓటుకు నోటు చేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ‌ను ప‌క్క‌న పెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంది. రాహుల్ విషం చిమ్మే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని కేటీఆర్ నిప్పులు చెరిగారు.


క‌ర్ణాట‌క‌లో ఐదు గంట‌ల క‌రెంట్ కూడా వ‌స్త‌లేద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని మంత్రి తెలిపారు. ఇది కాంగ్రెస్ ప‌రిస్థితి. తెలంగాణ‌ను వ‌చ్చి ఉద్ద‌రిస్తం అంటే మోసం చేయ‌డం కాదా..? రాజ‌స్థాన్, హిమాచ‌ల్‌లోనూ అదే ప‌రిస్థితి. కేసీఆర్ పాల‌న గొప్ప‌గా ఉంది. మాట మీద ఉండే నాయ‌కుడు కేసీఆర్. మ‌న మేనిఫెస్టోను, ప‌థ‌కాల‌ను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రైతుబంధు ఆలోచ‌న సృష్టిక‌ర్త కేసీఆర్. కేసీఆర్ మ‌ళ్లీ గెల‌వాలి. మ‌న తెలంగాణ అభివృద్ధిలో ప‌రుగులు పెట్టాలి. కాంగ్రెస్ చేతిలో పెడితే తెలంగాణ ఆగ‌మైపోత‌ద‌నే విష‌యం గ్ర‌హించాల‌ని కేటీఆర్ సూచించారు.