Kavitha సీఎం కేసీఆర్ దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తామే రాష్ట్రాన్ని ప్రకటించామని ప్రగల్బాలు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... రాహుల్ గాంధీ బబ్బార్ షేర్ కాదని... పేపర్ పులి మాత్రమేనని అని విమర్శించారు. గాంధీ కుటుంబానికి తెలంగాణకు మధ్య విద్రోహ సంబంధం ఉందని ఆరోపించారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు బీఆర్ఎస్ హయాంలోని న్యాయం జరిగిందని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో బీడీ కార్మికులకు న్యాయం జరిగేలా ఉందన్నారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ మృతి చెందిన వారికి ప్రభుత్వ బీమా వర్తిస్తుందని హామీ ఇచ్చారు. గల్ఫ్ లో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డు నుంచి ఎట్టి పరిస్థితుల్లో తొలగించే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలని కవిత సూచించారు.
" నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు.. నేను మీ ఇటలీ రాణిని కాదు. మీ ఇటలీ రాని లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను" అని కవిత వ్యాఖ్యానించారు. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డిని తప్పకుండా తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.
నెహ్రూ కాలం నుంచి వాళ్ల కుటుంబానికి తెలంగాణతో అనుబంధం ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, తెలంగాణతో రాహుల్ గాంధీ కుటుంబానికి నమ్మకద్రోహపు అనుబంధం ఉన్నదని మండిపడ్డారు. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన 369 మందిని తుపాకులతో కాల్చి చంపించిన చరిత్ర కాంగ్రెస్‌ది అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బిడ్డ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అంజయ్యను రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అవమానించారని చెప్పారు. సీఎం కేసీఆర్ చావు నోట్లో తల పెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్లీ వెనక్కి తీసుకుంటే వందలాదిమంది బిడ్డల చావులకు సోనియాగాంధీ కారణమయ్యారని అన్నారు. ప్రజా పోరాటాలతోనే 2014లో తెలంగాణ వచ్చిందని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ కాదు.. ఎలక్షన్ గాంధీ..
తెలంగాణ కోసం పార్లమెంటులో సహకారంగా ఒక్క మాట కూడా రాహుల్ గాంధీ మాట్లాడలేదని కవిత పేర్కొన్నారు. ఆయన రాహుల్ గాంధీ కాదు… ఎలక్షన్ గాంధీ. ఎన్నికలు రాగానే అనుబంధము, కుటుంబము, మన్నుమశానం అని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు, హైకోర్టు కావాలని మేము పార్లమెంట్‌లో పోరాటం చేసిననాడు, విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే, రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు ? మాట్లాడే మనసు ఎందుకు రాలేదు ? అని కవిత ప్రశ్నల వర్షం కురిపించారు.