Cheruku Sudhakar: ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాక‌ర్ శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చెరుకు సుధాక‌ర్‌కు  బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హ‌రీశ్‌రావు బీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నేతల తీరును నిరసిస్తూ చెరుకు సుధాకర్‌ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 


ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. చెరకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం గొప్ప విషయం అన్నారు. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో సుధాకర్ బీఆర్ఎస్‌లో చేశారని అన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన వ్యక్తి కేసీఆర్ ఒకవైపు, తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు పెట్టిన వ్యక్తి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి మరో వైపు ఉన్నారని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి డీఎన్‌ఏలో బీజేపీ, బీఆర్ఎస్, తెలుగుదేశం, కాంగ్రెస్, ఏ పార్టీఉందని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.  


రేవంత్ రెడ్డి డీఎన్ఏ, రాహుల్ గాంధీ డీఎన్‌ఏ మ్యాచ్ కావడం లేదని సటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పక్కన పెట్టుకుని అవినీతి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు సీటుకు నోటు నడుస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో నోట్లు ఇస్తేనే సీట్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు. 40 నుంచి 45 సీట్లలో పోటీచేయడానికి అభ్యర్థులు లేరని అన్నారు. 


బలిదేవత సోనియమ్మ అన్న వ్యక్తిని నేడు పీసీసీ ప్రెసిడెంట్‌ని చేశారని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి విషయం లేదని అందుకే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పేరును రాంగ్ గాంధీ మార్చుకోవాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని, వానాకాలం, యాసంగిలో సీఎం కేసీఆర్ ప్రతి ఒక్క రైతు నంచి ధాన్యం కొనుగోలు చేయించారని అన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న చత్తీష్ గడ్‌లో ఎకరానికి 13 క్వింటాళ్లే కొంటున్నారని, మిగతా వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించుకోవాల్సి వస్తుందన్నారు.


మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అదృష్టం ఉంటేనే ఆడపిల్లలు పుడతారని అన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే ఎంతో ఆలోచిస్తామన్నారు. అలాంటిది ఎంతో కష్టపడి సాధించుకన్న రాష్ట్రాన్ని ఈరోజు వేరే వాళ్ల చేతిలో పెట్టాలంటే ఆలోచించాలా వద్దా అని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్ తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ హాయంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. గతంలో తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. 


చెరకు సుధాకర్ మాట్లాడుతూ.. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చని, ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని అన్నారు.  కాంగ్రెస్‌ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ మాటల్లో తప్ప ఆచరణలో లేదని విమర్శించారు.  బీసీలకు కేటాయించిన 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాలేదని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్‌రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు.