తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల ప్రకటించారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగానే ఎన్నికల బరిలో నిలవనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తాను. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ కోసం పని చేస్తాను. ఎన్నికల్లో పోటీ చేసేందుకు మేం సిద్ధం. కొన్ని రోజులుగా మీడియాలో మా పేరు వస్తోంది. కంటోన్మెంట్ సీటు ఇస్తే అక్కడి కాంగ్రెస్ నాయకులను కలుపుకొని పని చేస్తా. నాన్న గద్దర్ చివర్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వస్తున్నా.' అని తెలిపారు.
కాంగ్రెస్ నుంచే ఎందుకు.?
కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాననేది వెన్నెల స్పష్టం చేశారు. తన తండ్రి గద్దర్ ను కాంగ్రెస్ చేరదీసిందని, అండగా ఉంటామని చెప్పిందని, అందుకే ఈ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని, రాహుల్ గాంధీ పేదలను అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. గద్దర్ జీవితాంతం సమ సమాజం కోసం తపన పడ్డారని, భారత రాజ్యాంగం అమలు పరచాలని కోరుకునే వారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తితో పని చేస్తామని కాంగ్రెస్ అంటోందని, అందుకే ఆ పార్టీ నుంచే బరిలో నిలవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గద్దర్ త్యాగాల మేరకు తమ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని భావిస్తున్నామని వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా కంటోన్మెంట్లో పని చేస్తున్నానని, అయినా కాంగ్రెస్ లో తనకు సభ్యత్వం లేదని, కానీ కాంగ్రెస్ సానుభూతి పరులమని చెప్పారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఓకే, లేకుంటే టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల్లో నిలవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
గద్దర్ భార్య ఏమన్నారంటే.?
'కాంగ్రెస్ పార్టీ తన బిడ్డకు టికెట్ ఇస్తామని ఆలోచిస్తున్నట్లు మీడియాలో వస్తుంది. నా బిడ్డకు టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేస్తా. వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నా.' అని గద్దర్ భార్య విమల విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.