Mega Politics :  "నేను రాజకీయానికి దూరం అయ్యాను కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు" అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ మార్మోగిపోయింది. రాజకీయవర్గాలు కూడా ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాయి. చిరంజీవి పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని వాకబు చేయడం ప్రారంభించారు. నిజానికి అది చిరంజీవి అప్ కమింగ్ మూవీ "గాడ్ ఫాదర్" సినిమా డైలాగ్ అని కొద్ది సేపటికి అందరూ రియలైజ్ అయ్యారు. కానీ మెగా రాజకీయ ప్రభావం గురించి మాత్రం చర్చ ఆగలేదు. ఎందుకంటే చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు కానీ ఆయనకు రాజకీయాలు దూరం కాలేదు. 


చిరంజీవి కోసం భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నం !


తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ.. చిరంజీవిని తమ పార్టీలోకి తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసిందనేది బహిరంగ రహస్యం. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తన రాజ్యసభ సభ్యత్వం పూర్తి కాక ముందే రాజకీయంగా సైలెంట్ అయిపోయిన చిరంజీవిని ఆ తర్వాత బీజేపీ వైపు ఆకర్షించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సోము వీర్రాజు మొదట చిరంజీవితోనే భేటీ అయ్యారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఆప్యాయంగా చిరంజీవితో మాట్లాడారు . పార్టీలోకి ఆహ్వానించారో లేదో తెలియదు కానీ అప్పుడు కూడా చిరంజీవి - బీజేపీ అనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికీ చిరంజీవి వైపు నుంచి ఎలాంటి చిన్న సానుకూలత కనిపించినా బీజేపీ ... అందుకుంటుంది. ఆయన స్థాయికి తగ్గట్లుగా పదవి ఇచ్చి గౌరవించడానికి సిద్ధంగా ఉంటుందనడంలో సందేహం లేదు.


చిరును తమ ఖాతాలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేసిన వైఎస్ఆర్‌సీపీ !


బీజేపీ పిలిస్తేనే చిరంజీవి ఆసక్తి చూపించలేదు...మరి వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆఫర్ వస్తే అంగీకరిస్తారా ? ఇది.. సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఒక్కరే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లి జగన్‌ ఫ్యామిలీతో లంచ్ చేసి ఆయన హైదరాబాద్ వెళ్లేందుకు  విమానం ఎక్కగానే... బయటకు వచ్చిన  చిరంజీవికి వైఎస్ఆర్‌సీపీకి రాజ్యసభ సీటు అనే ప్రచారంపై ఎక్కువ మందిలో వచ్చిన స్పందన. దీనికి కారణం ఉంది. వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆయనకు రాజ్యసభ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన ఏమంటారోనన్న ప్రతిపాదన పెట్టలేపోయారు. జగన్ తో భేటీ తర్వాత  వైఎస్ఆర్‌సీపీ.. ఆ లీక్‌ను కొన్ని మీడియా సంస్థల ద్వారా ప్రచారం చేయించింది. కానీ మెగాస్టార్ టెంప్ట్ కాలేదు. నిర్మోహమాటంగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను కాబట్టి  అలాంటి ఆఫర్ ఇచ్చే చాన్స్ లేదని తేల్చేశారు. కానీ పవన్ కల్యాణ్ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి చిరంజీవి అవసరం ఉందని వైఎస్ఆర్‌సీపీ భావిస్తోంది. అందుకే ఆయన విషయంలో చాలా సాఫ్ట్ గా వ్యవహరిస్తూ ఉంటారు. చిరంజీవి అంగీకరిస్తే వైఎస్ఆర్‌సీపీ రెడ్ కార్పెట్ వేస్తుంది. అందులో ఒక్క శాతం కూడా అనుమానం అక్కర్లేదు.


తమ పార్టీ వాడేనంటున్న కాంగ్రెస్ !


చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలా కాంగ్రెస్ పార్టీ నేత అయ్యారు. ఆ తర్వాత మరే పార్టీలో చేరలేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ సభ్యుడే అనుకోవచ్చు. చాలా సార్లు ఇదే అంశంపై చర్చ కూడా జరిగింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న ఊమెన్ చాందీ.. ఓ సందర్భంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అవసరం అయినప్పుడు అందుబాటులోకి వస్తారని ప్రకటించారు. కానీ ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకా..  చిరంజీవికా ఇన్నది ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు  రావడం లేదు. సభ్యత్వం పునరుద్ధరించుకోలేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ సభ్యుడు కాదన్న వాదన కూడా ఉంది. అయితే  చిరంజీవి వస్తానంటే..రాహుల్ గాంధీ ఎదురేగి ఆయనకు జాతీయ స్థాయిలో సముచిత ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే చిరంజీవి క్రేజ్ అలాంటిదే.


చిరంజీవి తమ నేతగానే పరిగణిస్తున్న జనసేన !


చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు . ఈ పార్టీలో చిరు అభిమానులందరూ చేరిపోయారు.  అయితే  చిరంజీవి సోదరుడి గురించి వ్యక్తిగతంగా స్పందిస్తూంటారు. పవన్ అనుకున్నది సాధిస్తారని చెబుతూంటారు.  కానీ ఆయన రాజకీయ పార్టీ గురించి ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. జనసేన పార్టీ  అధ్యక్షుడు అవుతాడన్న ప్రచారం చాలా సార్లు జరిగింది  కానీ అలాంటిదేమీ లేదు.  అయితే  చిరంజీవి ప్రత్యక్షంగా లేకపోయినా ఉన్నా...   జనసేన పార్టీకే ఆయన మద్దతు ఉంటుందనేది బహిరంగరహస్యం. రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన  బహిరంగ ప్రకటన చేయకపోవచ్చు..కానీ ఆయన ఫ్యాన్స్ .. అనుచరగణం ఆటోమేటిక్‌గా జనసేన ఫ్యాన్సే.



ఎలా చూసినా నిజంగానే చిరంజీవి రాజకీయాల్ని వద్దనుకున్నారు. దూరంగా ఉన్నారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనను వదిలి పెట్టలేదు. వైఫైలా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయి. చిరంజీవి ఎప్పుడు మానసు మార్చుకున్నా  గ్రాండ్ ఎంట్రీ ఉండే చాన్స్ ఉంటుంది.