GodFather Chiru :  రాజకీయాలకు దూరంగా ఉన్నా కానీ రాజకీయం తన నుంచి దూరం కాలేదని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. సినిమాల్లో చెప్పే డైలాగ్ తరహాలో ఉన్న ఈ వ్యాఖ్యల ఆడియో బిట్‌ను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది క్షణాల్లో వైరల్ అయింది. 



గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగా ?


చిరంజీవి డైలాగ్ ఇప్పుడు రాజకీయాల్లోనే కాదు.. సినిమా రంగంలోనూ చర్చనీయాంశం అవుతోంది.  చిరంజీవి నెక్ట్స్ రిలీజ్ కాబోయే సినిమా గాడ్ ఫాదర్. అది రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా.  మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్‌కు తెరకెక్కించారు. త్వరలో విడుదల కానుంది. ఆ సినిమా లో చిరంజీవి పవర్ ఫుల్ పోషిస్తారు. నేరుగా రాజకీయాల్లో ఉండరు. కానీ రాజకీయాలను కనుసైగతో శాసిస్తారు. కానీ బయటకు మాత్రం చాలా సాదాసీదాగా ఉంటారు. అలాంటి క్యారెక్టర్ కాబట్టి .. ఈ డైలాగ్ వాడి ఉంటారని భావిస్తున్నారు. పవర్ ఫుల్‌గా ఉన్న డైలాగ్‌ను టీజర్‌గా వదిలి ఉంటారని.. రాజకీయంగా ఉండటం వల్ల మరింతగా పబ్లిసిటీ వస్తుందని ఫిల్మ్ మేకర్స్ భావించి ఉంటారని అంచనా వేస్తున్నారు. 


తన ప్రస్తావన తీసుకొస్తున్న ఏపీ రాజకీయ పార్టీలకు హెచ్చరికా ?


అదే సమయంలో రాజకీయంగానూ చిరంజీవి ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని చెబతున్నారు. ఎందుకంటే చిరంజీవి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చాలా సార్లు ప్రకటించారు. ఎప్పుడో విరమించుకున్నానన్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో మాత్రం తరచూ చిరంజీవి ప్రస్తావన వస్తోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లిన తరవాత ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పుడే ఖండించారు. తర్వాత పవన్ కల్యాణ్ ను విమర్శించే వైఎస్ఆర్‌సీపీ నేతలు చిరంజీవి ప్రస్తావన తీసుకు వస్తూంటారు. పవన్ కల్యాణ్‌ను మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించేటప్పుడు ఖచ్చితంగా చిరంజీవి ప్రస్తావన తెస్తారు. అన్నకు వెన్నుపోటు పొడిచారంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇలా తనను రాజకీయాల్లోకి పదే పదే తీసుకు వస్తూండటంతో... క్యాచీగా ఉంటుందని ఈ డైలాగ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 


చిరంజీవి స్పందిస్తేనే క్లారిటీ 


చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రారని పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు కూడా చెప్పారు. చిరంజీవి కూడా అదే చెప్పారు. ఈ విషయంలో చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకోరని.. సోదరుడు పవన్ కల్యాణ్ సొంత పార్టీ పెట్టుకుని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నందున  పరోక్షంగానైనా ఆయనకే మద్దతిస్తారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి చేసిన తాజాగా ట్వీట్ .. రాజకీయవర్గాల్లోనూ చర్చోపచర్చలకు కారణం అయి....  రాజకీయాల్లోకి రీఎంట్రీపై ఊహాగానాలు ప్రారంభమైతే.. అలాంటి ఆలోచన ఉందో లేదో మెగాస్టార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. లేకపోతే సినిమా ప్రమోషన్ అనుకోవచ్చు.