Chinna Srinu No More Competition In Election: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైసీపీ జిల్లా అధ్యక్షుడి మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కి రెండు రోజులు కిందట రీజనల్ డిప్యూటీ కో-ఆర్డినేటర్ పేరుతో పార్టీ అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ బాధ్యతలు చిన్న శ్రీనుకు పదోన్నతిగా చాలా మంది భావిస్తుంటే.. ఆయనతో సన్నిహితంగా మెలిగే కొంత మంది నేతలు మాత్రం అంతర్మథనం చెందుతున్నారు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయన్న తరుణంలో పార్టీ చిన్న శ్రీనుకు అదనపు బాధ్యతలను అప్పగించడం వెనుక పెద్ద మర్మమే దాగి ఉందన్న ప్రచారమూ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో చిన్న శ్రీను అసెంబ్లీకి వెళ్లాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, పార్టీ అధిష్టానం ఎంపీగా బరిలోకి దించేందుకు సన్నాహాలు చేసిందన్న ప్రచారం జరిగింది. విజయనగరం ఎంపీ స్థానం మజ్జి శ్రీనివాసరావు బరిలోకి దిగుతున్నారన్న ప్రచారమూ జోరుగానే సాగింది. మూడు, నాలుగు దశల్లో వెలువడే జాబితాలో పేరు ఉంటుందని చెప్పారు. కానీ, ఇప్పటికి ఆరు దశల్లో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. కానీ, మజ్జి శ్రీనివాసరావు పేరును అధిష్టానం ప్రకటించలేదు. పైగా, పార్టీలో అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రెండు రోజులు కిందట ప్రకటన వెలువడింది. ఇదే ఇప్పుడు ఆయన అనుచరులు, ముఖ్య నాయకుల్లో టెన్షన్‌కు కారణమవుతోంది.
పార్టీ బాధ్యతలు అందుకే!
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఉద్ధేశంతో రెండు, మూడు నియోకజవర్గాలపై కర్చీప్ వేసి తన ప్రయత్నాలను సాగించారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల, విజయనగరం జిల్లాలోని ఎస్ కోట, బొబ్బిలి వంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ముందు నుంచి ఎచ్చెర్ల నుంచి బరిలో దిగేందుకు ఆయన సన్నాహాలు చేశారు. ఈ మేరకు పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పారు. ఆ తరువాత మారిన రాజకీయ సమీకరణాలతో పార్టీ అధిష్టానం సూచనలు మేరకు విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. దీనికి ఆయన అయిష్టంగానే సానుకూలతను వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా వైసీపీ అధిష్టానం చిన్న శ్రీనకు పార్టీలో అదనపు బాధ్యతలను అప్పగించింది. వచ్చే ఎన్నికల్లో సీట్లు రాని వారికి, సీట్లు వద్దనుకున్న వారికి పార్టీలో బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. తాజాగా మజ్జి శ్రీనువాసరావుకు ఆదే విధానంలో ఇచ్చారా..? లేక మరేదైనా ఆలోచన ఉందా..? అన్నది తెలియాల్సి ఉంది. వైవీ సుబ్బారెడ్డి వంటి నేతలకు పార్టీలో బాధ్యతలను అప్పగించారంటే వారు వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండడం లేదు. రాజ్యసభకు వైవీ సుబ్బారెడ్డిని పంపిస్తున్నారు. ఇదే తరహాలో చిన్న విషయంలోనూ ఆలోచిస్తున్నారా..? లేక ఆయనకు ఉన్న రాజకీయ అనుభవాన్ని వినియోగించుకునే ఉద్ధేశంతో ఈ బాధ్యతలను అప్పగించారా అన్నది కొద్దిరోజులు నిరీక్షిస్తేగానీ తేలదు.
పోటీకి మాత్రం సిద్ధంగానే
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఒకవేళ పార్టీ బాధ్యతలను అప్పగించి పోటీకి దూరంగా ఉండమంటే.. ఆయన సైలెంట్ కూర్చునే పరిస్థితి ఉండదని ఆయనకు దగ్గరగే మెలిగే ఎంతో మంది చెబుతున్న మాట. సీఎం జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగే ఉత్తరాంధ్ర నేతల్లో ఆయన ఒకరు. అటువంటి నేతకు సీటు ఇవ్వకుండా ఉండరని పలువురు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆయనకు ఉన్న పరిచయాలు, అనుచరులు నేపథ్యంలోనే పార్టీలో అదనపు బాధ్యతలు అప్పగించినట్టు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెబుతుంటారు. ఇవన్నీ, దృష్టిలో పెట్టుకునే అధిష్టానం పార్టీలో బాధ్యతలు అప్పగించినట్టు చెబుతున్నారు. మరీ పార్టీ చిన్న శ్రీను విషయంలో మరో నిర్ణయం తీసుకుంటుందా..? లేదా అనేది చూడాల్సి ఉంది.