Chandrababu Meeting With Telangana TDP : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజార్టీతో ఏపీలో ప్రభుత్వాన్ని కూటమి ఏర్పాటు చేసింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు పూర్తయింది. గడిచిన రెండు నెలలు నుంచి బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.


మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణలో నిర్వహించేందుకు ఇక్కడి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టీటీడీపీ నేతలతో కీలక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇకపై తెలంగాణలో పార్టీ బలోపేతాన్ని చేయడంపై దృష్టి సారిస్తాన్న చంద్రబాబు.. ఇకపై ప్రతినెల రెండో శనివారం, ఆదివారాన్ని తెలంగాణకు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తానన్న చంద్రబాబు.. త్వరలోనే గ్రామ స్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేసేలా చర్యలు చేపడతామన్నారు. 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నట్టు నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ టీడీపీలో యువకులకు, బీసీలకు పెద్ద పీట వేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా నాయకులకు సూచించారు. 


కొద్దిరోజుల్లోనే పార్టీ అధ్యక్షుడి నియామకం


సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకాన్ని చేపడతామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పార్టీ నాయకులను చూసి చాలా రోజులైందని, అందరినీ చూసేందుకు వచ్చినట్టు చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అభిమానులు, కార్యకర్తలు కోరుతున్నారని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గడిచిన ఎన్నికల్లో పోటీ చేయలేదని వివరించారు. అనివార్య కారణాలు వల్ల పార్టీ అధ్యక్షుడిని కూడా నియమించలేదని, ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై నాయకులు దృష్టి సారించాలన్న చంద్రబాబు.. త్వరలోనే పార్టీ అధ్యక్షుడిని నియమిస్తానని స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలంగాణలో తెలుగుదేశం బలమైన పార్టీగా ఉండేదని, కొన్ని కారణాల వల్ల బలహీనపడ్డామన్నారు. మళ్లీ పుంజుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సామరస్యపూర్వకంగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఏపీలో జరిగిన ఐదేళ్ల విధ్వంసాన్ని సరి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పిన చంద్రబాబు.. తెలంగాణ నేతలను కలిసేందుకు అందువల్లే కొంత ఆలస్యమైందన్నారు.