Chandrababu :   ఏపీలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది.  తెలంగాణతో పాటు ఎన్నికలు వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఎన్నికలకు వెళ్లాలా వద్దా అన్నది సీఎం జగన్ చాయిస్. ఆయన మాత్రం మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారని.. ముందస్తు ఆలోచనే లేదని పార్టీ నేతలకు చెబుతున్నారు. అయినా సరే.. ఆ తర్వాత మరో ఐదు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నందున ఆ వేడి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఓ వైపు లోకేష్ పాదయాత్ర వచ్చే ఏడాది వరకూ సాగనుంది. చంద్రబాబు కూడా మరో వైపు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. 


గ్రామాల్లో బస చేయాలని  చంద్రబాబు నిర్ణయం 


చంద్రబాబు ప్రచార పర్యటనలు విభిన్నంగా సాగనున్నాయి.  ప్రచార కార్యక్రమాల్లో గ్రామాల్లో రాత్రిపూట బస చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  రాబోయే ఎన్నికలకు  ముందుగానే పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో రాత్రి బసలో పార్టీ నేతలు, స్థానికులతో సమావేశమవుతారు. పార్టీ నాయకులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయించాలనే డిమాండ్ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రణాళికలు పార్టీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల వల్ల నేతలందరినీ కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాగే కొనసాగితే వివిధ నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు అవకాశం లేకపోలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. నాయకులు పార్టీ కోసం పనిచేసేలా చేయాలని కూడా ఆయన భావిస్తున్నారు.


పార్టీ కార్యకర్తల నివాసాలకూ వెళ్లే అవకాశం 


రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వెడెక్కేలోగా పార్టీనీ సన్నద్ధం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే 55 వరకు నియోజకవర్గాల్లో సమీక్షలు, విశ్లేషణలు చేసి ఇన్‌ఛార్జ్‌లను సన్నద్ధం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాన్నిఎండగడుతూ చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రకు ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. పార్టీ కేడర్‌ను, పునాదిని పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీలో ముఖ్యుల నుంచి వస్తున్న వినతుల నేపధ్యంలో ఆయన జిల్లాల్లో పర్యటించాలని.. గ్రామాల్లో బస చేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో పార్టీ కార్యకర్తల పనితీరును సమీక్షించేందుకు ప్రాంతాల వారీగా సమావేశాలు చంద్రబాబు నిర్వహించారు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలని ప్లాన్‌ చేస్తున్న ఆయన తదుపరి కదలిక చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎన్నికలు జరిగే నాటికి కార్యకర్తల్లో విశ్వాసం నింపేందుకు ఆయన పార్టీ కార్యకర్తల నివాసాల్లో బస చేయాలని భావిస్తున్నారు. గ్రామ పర్యటనలు, బసల్లో కూడా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి తగిన వాగ్దానాలు చేసే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. 


పవన్ కల్యాణ్ వారాహి యాత్ర


మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వారాహి యాత్ర చేపట్టనున్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ పర్యటనలు మూడు భిన్నమైన ప్రాంతాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. మరో వైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారానికో సభ ద్వారా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. అవే రాజకీయ ప్రచార సభలుగా మారాయి.  అవేనా.. ఇంకా ఏమైనా జిల్లాల  పర్యటనలు చేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.