Kotam Reddy Srinivas Reddy: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సీఎం జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బాలకృష్ణ గొప్ప వ్యక్తిత్వం.. మనస్తత్వం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జోలికి వచ్చినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా నాలుక కోస్తానని  హెచ్చరించారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల విడుదల సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు..


తన తల్లి క్యాన్సర్ తో మరణిస్తే..
బసవతారకం ఆస్సత్రి ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచితంగా చికిత్స అందిస్తున్న గొప్ప వ్యక్తి బాలకృష్ణ అని కోటంరెడ్డి కొనియాడారు. సీఎం జగన్ ఎక్కడ చంపేస్తాడోనని భయపడి ఆయన చెల్లి షర్మిల, ఆయన తల్లి విజయమ్మ ప్రాణ భయంతో తెలంగాణ రాష్ట్రానికి పారిపోయిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ మోహన్ రెడ్డి వేలకోట్లు సంపాదించారని, 11 కేసుల్లో ముద్దాయిగా ఉంటూ 16 నెలలు చిప్ప కూడు తిన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


‘రాష్ట్రంలో తిరగనివ్వం జగన్’
నందమూరి, నారా కుటుంబాలు 30 ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఒక్క అవినీతి మరక కూడా లేని నిస్వార్థవ్యక్తి బాలకృష్ణ అని కోటంరెడ్డి అన్నారు. ప్రజాసేవ తప్ప అవినీతి, అక్రమాలు బాలకృష్ణకు తెలియవన్నారు. జగన్‌లా వేలకోట్లు దోచుకొని జైలు జీవితం అనుభవించలేదన్నారు. బాలకృష్ణ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని, రాష్ట్రంలో తిరగనివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటామని కోటంరెడ్డి సీఎం జగన్‌ను హెచ్చరించారు.


పవన్ పెళ్లిళ్లు పోలవరాన్ని అడ్డుకున్నాయా? 
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. నిన్నటి సభలో పవన్ పెళ్లిళ్లపై సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను సైతం కోటంరెడ్డి ఖండించారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.  రాష్ట్రాన్ని జగన్ అభివృద్ధి చేస్తానంటే మూడు పెళ్లిళ్లు అడ్డుకుంటాయా.. ? అంటూ నిలదీశారు. పోలవరం పూర్తి చేస్తానంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఏమన్నా అడ్డుపడ్డాయా..? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ పెళ్లిళ్ల గురించి జగన్‌కు ఎందుకు అంటూ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని, ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదంటూ ప్రశ్నించారు.


టీడీపీతోనే అభివృద్ధి
సీఎం జగన్ పాలన అంతా దోచుకో దాచుకో తీరుగా తయారైందని కోటంరెడ్డి విమర్శించారు. జగన్ అధికారం చేపట్టాక రాష్ట్రంలో అభివృద్ధి పడిపోయిందన్నారు. 2024లో దార్శనికుడు చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. అందుకోసమే మహానాడులో టీడీపీ మినీ మేనిఫెస్టోను విడుదల చేశారని అన్నారు. కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మమిడల మధు, మాజీ కార్పొరేటర్ కపిరి శ్రీనివాసులు, కువ్వరపు బాలాజీ, ఆకుల హనుమంతు రావు, పసుపులేటి మల్లిఖార్జున, వినుకుల్ సుధాకర్ రాజు, తబి సుజన్ కుమార్ పాల్గొన్నారు.