రాయలసీమ జిల్లాల పర్యటనలో చంద్రబాబు పార్టీ నేతలకు వరుస షాక్‌లు ఇచ్చారు. తాము సీనియర్లమని పట్టుకు వేలాడతామంటే సాధ్యం కాదని సంకేతాలిచ్చారు. తొమ్మిది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పలు జిల్లాల్లో పర్యటించారు. అనేక చోట్ల బహిరంగ సభలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలకు వివరించారు. ఆయన ప్రసంగాలలో వినూత్న వరవడి కనిపించింది . ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే ప్రజలలో తన పార్టీ పట్ల విశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. అనంతపురం పర్యటనలో 40 శాతం పాతవారిని పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ విధానాలను అతిక్రమిస్తున్న చాలా మంది సీనియర్లలో గుబులు రేగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాకు చెందిన చాలామంది పదవులు పొందడంతో పాటు ఆర్థికంగా లబ్ధి చేకూర్చున్నారు.
ఇలా లబ్ది పొందినవారు కూడా ప్రస్తుతం చంద్రబాబు చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమంలో జన సమీకరణ, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను సైతం భరించేందుకు కొంతమంది నిరాకరించారు.. దీంతో ఆయన పలువురు సీనియర్ నాయకుల పై సీరియస్ గా ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం టికెట్ల కేటాయింపులో ప్రస్ఫుటంగా కనిపిస్తుందేమోనన్న అనుమానం నాయకులను పట్టి పీడిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి. కర్నూలులో కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి డోన్ లో టికెట్ కేటాయించకుండా ధర్మవరం సుబ్బారెడ్డి కి టికెట్ కేటాయిస్తున్నట్లు బాదుడే బాదుడు కార్యక్రమంలో ప్రకటించారు. 40 శాతం పాత వారికి టికెట్లు లేదన్న అంశంతో పాటు సీనియర్లైన కే.ఈ.కుటుంబానికి టికెట్ నిరాకరణ వంటి అంశాలు ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా లోని సీనియర్ నాయకులలో గుబులు రేపుతోంది.
పైకి ఆత్మవిశ్వాసంతో కనిపించినప్పటికీ లోలోన తీవ్రంగా మధన పడుతున్నట్లు సమాచారం. పులి మీద పుట్రలా అధినేత పర్యటనకు అయ్యే ఖర్చులు పెట్టుకునేందుకు కొంత మంది నేతలు నిరాకరించడం ఆ నేతలకు మైనస్‌గా మారింది. పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లె లో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు , అభిమానులకు భోజనాలు, త్రాగు నీరు వంటి కనీస సౌకర్యాలను కూడా కల్పించడంలో లో స్థానిక తెలుగుదేశం నాయకులు విఫలమయ్యారు. దీని వల్ల అధినేత ప్రసంగిస్తుండగానే చాలా మంది అభిమానులు సభావేదిక నుంచి వెళ్లిపోయినట్లు విమర్శలున్నాయి.
ఈ విషయంపై కూడా చంద్రబాబు సీరియస్ గానే అక్కడి నాయకత్వాన్ని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తూ, ఆర్థికంగా లబ్ధి పొంది పార్టీ కష్టకాలంలో ఉన్న సమయాలలో కార్యకర్తల బాగోగులకు పైసా విదల్చని నాయకత్వం మాకు వద్థు అంటూ పార్టీ యువత తెగేసి చెబుతోంది. ఇలాంటి సందర్భాలలో తెలుగుదేశం నాయకులు సవితమ్మ, ఉన్నం మారుతి వంటి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏదేమైనా సీనియర్ తెలుగుదేశం నాయకులకి అయితే ఒకింత మనశ్శాంతి కరువైందని కార్యకర్తలు కూడా చెప్పుకుంటున్నారు.