Chandrababu On NDA : తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీఏలో చేరబోతోందని ఢిల్లీ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అనుకూలం అని ముద్ర ఉన్న టీవీ చానళ్లలోనే ఈ ప్రచారం జరుగుతూండటంతో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును పలువురు మీడియా ప్రతినిధులు ఇదే అంశంపై ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆయన ఈ విషయంపై మీడియా ప్రతినిధులకు క్లారిటీ ఇచ్చారు. తాము ఎన్డీఏలో చేరుతున్నామో లేదో..  ప్రచారం చేసేవారే జవాబు చెప్పాలని స్పష్టం చేశారు. ఎన్డీఏలో చేరతారన్న ప్రచారంపై స్పందించేందుకు చంద్రబాబు నిరాకరించారు. 


ఎన్డీఏలో చేరిక ప్రచారాన్ని ఖండించని చంద్రబాబు


అయితే చంద్రబాబు తాము మళ్లీ ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టలేదు. అంటే ఆప్షన్ ఉందన్నట్లుగానే చంద్రబాబు సమాధానం ఉందని భావిస్తున్నారు. గతంలో ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో కూడా చంద్రబాబు చెప్పారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని స్పష్టం చేశారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందన్నారు.  రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా నష్టపోయామన్నారు.  


రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలు చూస్తామన్న చంద్రబాబు


టీడీపీ గెలిస్తే..  చంద్రబాబు మళ్లీ సీఎం అయితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేస్తున్నారని.. అయితే అసలు సంక్షేమం ప్రారంభమయింది టీడీపీతోనే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అంటున్నారు.  చంద్రబాబుమళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామన్నారు.  అవగాహన లేనివారే సంక్షేమం గురించి మమ్నల్ని విమర్శిస్తున్నారని స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో  విభజన గాయాలు, ఆర్థికలోటులోనూ సంక్షేమ పథకాలు అమలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని  వ్యవస్థలు నాశనమయ్యాక ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చేసిందన్నారు. 


రాష్ట్రానికి మేలు చేస్తే మళ్లీ ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లేనా ? 


ఎన్డీఏ లో చేరికను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు. అలాగని ఆయన పాజిటివ్‌గా కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే .. కేంద్ర రాజకీయాలను చూస్తామని ఆయన చెప్పడంతో..  రాష్ట్రానికి మేలు జరిగితే.. ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిచ్చినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రం ఇప్పటికే ఆర్థికంగా పూర్తిస్థాయిలో కుదేలయింది. పన్నుల ఆదాయం ఎంత వస్తుందో అంత స్థాయిలో అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. జీతాల కోసమూ అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా రాష్ట్రం ఎప్పుడైనా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చేందుకు భారతీయ జనతా పార్టీ సహకరిస్తే  .. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు సానుకూలంగా స్పందించవచ్చని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.