Chandrababu Says Nominated Posts Will Be Filled Soon: రాష్ట్రంలోని నామినేటెడ్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఈ పోస్టుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భగా తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. అనంతరం టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్‌ స్థాయి కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


వారికే నామినేటెడ్ పోస్టులు 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్‌ పదవులు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ పార్టీ కోసం పని చేశారో వారికే పదవులు దక్కేలా అధ్యయనం ప్రారంభించామన్నారు. నేతలు, కార్యకర్తలు సాధికారిత సాధిస్తే పార్టీ పునాదులు బలంగా ఉంటాయన్నారు. అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూతపడ్డాయో వాటిని వంద రోజుల్లోనే తెరిపిస్తామని స్పష్టం చేశారు. కూటమి విజయం వెనుక కార్యకర్తలు, నాయకులు కష్టం, కృషి ఎంతో ఉందన్నారు. 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈ ఎన్నికల్లో గెలిచామన్న చంద్రబాబు.. ఈ విజయాన్ని కార్యకర్తలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నారు. కూటమి విజయం సాధారణమైనది కాదని, గాలివాటంగా వచ్చిన గెలుపు కాదన్నారు. కూటమికి 93 శాతం స్ర్టైక్‌ రేట్‌, 57 శాతం ఓట్‌షేర్‌తో విజయాన్ని అందించారన్నారు. ఉమ్మడి ఎనిమిది జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్‌ చేసిందని, ఈ విజయం వెనుక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు, ఐదేళ్లు పడిన కష్టం ఉందన్నారు.


90 వేలకు పైగా మెజార్టీలు సాధించాం 
గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90 వేలకుపైగా మెజారిటీలు వచ్చాయని, పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్‌, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్‌, పిఠాపురం నియోజకవర్గాల్లో 70 వేలకుపైగా మెజారిటీ వచ్చిందన్నారు. కూటమి విజయంలో మూడు పార్టీలు పాత్ర కీలకంగా పని చేసిందన్న చంద్రబాబు.. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు రుణం తప్పకుండా తీర్చుకుంటానన్నారు. ఐదేళ్లపాటు కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, అధికారం ఉందని కక్ష సాధింపులు, ప్రజావ్యతిరేక పనులు చేయవద్దని సూచించారు. ఎమ్మెల్యేలు, నేతలు కింది స్థాయి కార్యకర్తలను విస్మరించవద్దని సూచించారు. బాధ్యతగా, చిత్తశుద్ధితో పని చేసే ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్న చంద్రబాబు.. ఆ దిశగా పని చేయాలని సూచించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు దిశగా అడుగులు వేస్తున్నామన్న చంద్రబాబు.. సూపర్‌-6, ప్రజాగళం మేనిఫెస్టో ప్రకటించామని, వీటిని అమలు చేస్తామన్నారు. 2047 నాటికి దేశం ఉన్నత స్థాయిలో ఉండాలని, అందులో తెలుగువాళ్లు నెంబర్‌-1 ఉండాలని ఆకాంక్షించారు. 


కార్యకర్తల సంక్షేమ నిధితో సాయం 
కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులను పరిష్కరిస్తేనే వారిలో మనోబలం పెరుగుతుందని, గతంలో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి సాయం అందించామని, ఇక ముందు కూడా ఆదుకుంటామన్నారు. ప్రజాపాలనకు శ్రీకారం చుట్టామని, పాజిటివ్‌ గవర్నెన్స్‌ను తీసుకురానున్నట్టు తెలిపారు. పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారని, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్దామన్నారు. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే కృషి చేయాలని సూచించారు. ఇదే ఫలితాలు 2029లో వస్తాయని జోస్యం చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళతామన్నారు.