Where Is CBI:  సంచలనం సృష్టించించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా సీబీఐ ఇంకా  చార్జ్ తీసుకోలేదు. చివరికి సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై సీబీఐకి ఎలాంటి ఆటంకాలు రాలేదు. అయినా ఈ విషయంలో సీబీఐ వీలైనంత వరకూ సైలెన్స్ పాటిస్తోంది. కేసుకు సంబంధించిన పత్రాలివ్వాలని లేఖలు రాయడం తప్ప ఏమీ చేయడం లేదు. సుప్రీంకోర్టులోనూ క్లారిటీ వచ్చిన తర్వాత దూకుడు చూపిద్దామని ఆగుతోందా ? లేకపోతే ఇతర కారణాలతో సైలెంట్ అవుతున్నారా? 


ఎన్ని సార్లు లేఖలు రాసినా సీబీఐకి ఫైళ్లు ఇవ్వని తెలంగాణ సీఎస్ 
 
ఎమ్మెల్యేల ఎర కేసు కు సంబంధించిన  ఫైళ్లను  సీబీఐకి వెనువెంటనే అంద జేయాలని హకోర్టు తీర్పు వెలువరించి పది రోజులు దాటింది. ఐదు సార్లు లేఖలు రాశామని సీబీఐ మీడియాకు లీకులిచ్చింది. కానీ ఫైల్స్ మాత్రం సీబీఐకి అందలేదు. అలాగని సీబీఐ ప్రత్యామ్నాయ మార్గాన్నీ చూసుకోలేదు. సైలెంట్ గా ఉండిపోయింది. నేరుగా బీజేపీ పెద్దలకు ముడి పెట్టేందుకు తెలంగాణ సిట్ చేసిన ప్రయత్నం  ఈ కేసులో ఉన్నందున సీబీఐ కూడా ... తాము అత్యుత్సాహం చూపించామన్న  అభిప్రాయం కలగకుండా ఇలా వీలైనంత వరకూ ... అన్ని అవకాశాలు పరిశీలిస్తోందన్న చర్చ జరుగుతోంది. 


17న సుప్రీంకోర్టులో విచారణ - ఆ తర్వాత సీబీఐ యాక్షన్ ? 


ఈ కేసు విషయంలో సీబీఐ విచారణపై స్టే తెచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై 17వ తేదీన క్లారిటీ వస్తుంది. ఆ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే ఇక సీబీఐ రంగంలోకి దిగాల్సిన పని ఉండదు. ఒక వేళ వాయిదా పడినా... ఎలాంటి ఆదేశాలు రాకపోయినా సీబీఐ దూకుడు చూపించే అవకాశం ఉంది.17వ తేదీ తర్వాత  ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయినా  నేరుగా కదన రంగంలోకి దిగాలని సీబీఐ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫైళ్ళతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లాలని సీబీఐ ఢిల్లిలోని ప్రధాన కార్యాలయం ఉన్నతాధికారులు మౌఖిక ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. - ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రానిపక్షంలో దూకుడుగా వ్యవహరించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారని ఉన్నతాధికారులు న్యాయసలహాలు కూడా తీసుకున్నారని అంటున్నారు.  


మొదట ఎమ్మెల్యేల విచారణ ! 


భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పైలట్‌ రోహత్‌ రెడ్డి(తాండూరు), గువ్వల బాలరాజు(అచ్చంపేట), బీరం #హర్షవర్దన్‌ రెడ్డి(కొల్లాపూర్‌), రేగా కాంతారావు(పినపాక)లు ప్రధానంగా ట్రాప్ చేశారు. వీరిని మొదటగా ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు.  ప్రభుత్వం ఫైళ్లు ఇస్తే సరేసరి లేని పక్షంలో చివరి అస్త్రాన్ని ప్రయోగించాలన్న పట్టుదలతో సీబీఐ ఉన్నట్టు చెబుతున్నారు. 17వ తేదీ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేయాలన్న అంశంపై కూడా సీబీఐ సమాలోచనలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసు అటు  బీజేపీకి.. ఇటు బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే పదిహేడో తేదీ తర్వాత కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.