KTR Comments on CM Revanth Reddy: రేవంత్ సర్కారు ఐదేళ్లు నిక్షేపంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బయటి నుంచి ఎవరో కూల్చరని.. ప్రభుత్వాన్ని పడగొట్టే వారు ఆ పార్టీలోనే ఉన్నారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ సహా బీజేపీ నేత బండి సంజయ్ పైనా విమర్శలు గుప్పించారు. 'రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీపీ పెంచుకోకు. నీ ప్రభుత్వాన్ని కూల్చం. ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటాం. అప్పుడే వెలుగు చీకట్లకు తేడా తెలుస్తుంది. మీ ప్రభుత్వాన్ని కూల్చే ఖమ్మం, నల్గొండ మానవ బాంబులు మీ పార్టీలోనే ఉన్నాయి. నీకు ఫ్రస్టేషన్ ఎక్కువైంది. ఎన్నికలయ్యాక తమ ఎమ్మెల్యేలతో బీజేపీలో కలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న కోపాన్ని రైతులపై తీర్చుకుంటోంది. ఇంతకీ అబద్ధపు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారు.?' అని కేటీఆర్ ప్రశ్నించారు.


కరీంనగర్ సెంటిమెంట్


కరీంనగర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఓ సెంటిమెంట్ అని.. ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలకు శ్రీకారం చుట్టారని కేటీఆర్ అన్నారు. ఆనాడు ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచే జంగ్ సైరన్ మోగించారని.. ఇప్పుడు అబద్ధాల సీఎం రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 'పాలమూరు సభలో సీఎం రేవంత్ భాష నాకు అర్థం కాలేదు. మానవ బాంబై పేలుతా అంటున్నారు. ఆయన పక్కనే మానవ బాంబులు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం ఉండదు. రేవంత్ ఐదేళ్ల పాలన చూశాక ఎవరు గొప్పవాళ్లో ప్రజలకు తెలుస్తుంది. ఇది కాలం తెచ్చిన కరువు అని సీఎం అంటున్నారు. కానీ, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కానీ అలా చేయడం లేదు. కేసీఆర్ ను బద్నాం చేయాలనే చూస్తున్నారు.' అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కరువు మీద కేసీఆర్ సంధించిన బ్రహ్మస్త్రమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరించారు.


కాంగ్రెస్ దుష్ప్రచారం


బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ.. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీ గెలుపునకే కారణమవుతుందనేది అంతా గమనించాలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ కాబోతున్నారనేది గ్యారెంటీ అంటూ ఎద్దేవా చేశారు. ‘మరో 10 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజులు పూర్తవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకోవాలని సీఎం రేవంత్ నాకు సవాల్ చేశారు. ఇద్దరం రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే తేల్చుకుందాం అంటే చడీ చప్పుడు లేదు.' అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.


బండి సంజయ్ కు సవాల్


కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చొక్కారావు, బద్దం ఎల్లారెడ్డి, కేసీఆర్ వంటి మహానుభావులు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారని గుర్తు చేశారు. ఐదేళ్లు ఎంపీగా ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ ను నిలదీశారు. గత పదేళ్లలో ఐదేళ్లు వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నారని.. మరో ఐదేళ్లు బండి సంజయ్ ఎంపీగా ఉన్నారని, కేంద్రంలో పదేళ్లు మోదీ ప్రధానిగా ఉన్నారని అన్నారు. ఈ పదేళ్లలో కరీంనగర్ కు ఎవరు ఏం చేశారో.? తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. డేట్ అంట్ టైం ఫిక్స్ చేయాలని.. ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ అని చెప్పారు. ఎంపీ నిధులు ఖర్చు పెట్టడం చేతకాని వారు ఎంపీగా ఎందుకు ఉండాలని మండిపడ్డారు. 


వచ్చే ఏడాదంతా ఎన్నికలే ఉంటాయని.. పార్లమెంట్ తర్వాత, పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ వివరించారు. ఆ ఎన్నికల్లో అందరినీ గెలిపించుకునే బాధ్యత తమదే అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 


Also Read: BRS News: రేవంత్ పాలమూరు బిడ్డ కాదు, చంద్రబాబు పెంపుడు బిడ్డ - బీఆర్ఎస్