Telangana BRS Voting Bank Churn:   తెలంగాణ రాజకీయాల్లో   భారత్ రాష్ట్ర సమితి  అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు   మళ్లీ యాక్టివ్ కాబోతున్నారనే వార్తలు గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. కేసీఆర్ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా  బస్సు యాత్ర  చేపట్టబోతున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో సరికొత్త చర్చ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బస్సు యాత్ర చేసినప్పటికీ పార్టీ ఖాతాలో ఒక్క సీటు కూడా పడకుండా జీరో  ఫలితం రావడం కేసీఆర్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ దెబ్బతో దాదాపు రెండేళ్లకు పైగా ఆయన ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. కేవలం ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ, అలాగే జగిత్యాల లాంటి రెండు బహిరంగ సభల్లో మాత్రమే ఆయన ప్రసంగించి వెళ్లారు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి రాలేదు.

Continues below advertisement

ఎన్నికలకు క్యాడర్ ను రెడీ చేయడమే లక్ష్యం

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిపోతున్న తరుణంలో.. కేసీఆర్ ఇప్పుడు బస్సు యాత్ర అస్త్రం చేతబట్టడం వెనుక కేవలం పార్టీ ఉనికిని చాటుకోవడమే కాకుండా, రాబోయే స్థానిక సంస్థలు లేదా సార్వత్రిక ఎన్నికల కోసం క్యాడర్‌ను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. కేసీఆర్ ఈ యాత్ర పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ప్రజల్లోకి వచ్చే అవకాశాలు తక్కువే. అంతేకాదు, ఆయన ఇకపై అసెంబ్లీ సమావేశాలకు కూడా వచ్చే మూడ్‌లో లేరని స్పష్టమవుతోంది. సభలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే పూర్తి భారాన్ని ఆయన కేటీఆర్, తన్నీరు హరీష్ రావుల భుజాలపైనే పెట్టేశారు. సవాళ్లకు దూరంగా గులాబీ బాస్ 

Continues below advertisement

అసెంబ్లీ వేదికగా గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, అలాగే ప్రస్తుత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సవాల్ విసిరినా కేసీఆర్ సైలెంట్‌గా ఉండటం వెనుక పెద్ద వ్యూహమే ఉంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం వేస్తున్న పొలిటికల్ సవాళ్లకు సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. తన స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోరు, జూనియర్ నేతతో తాను నేరుగా తలపడటం వల్ల ఆయనకే ఎక్కువ పొలిటికల్ మైలేజ్ లభిస్తుంది  అనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు ప్యానల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావులకు వదిలేసి.. తాను మాత్రం కేవలం  ప్రజాక్షేత్రం  లోనే తేల్చుకోవాలనే పంథాను ఎంచుకున్నారు.

బస్సు యాత్రతో ప్రజల్ని ఆకట్టుకోగలరా?

 ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. గతంలో ఫ్లాప్ అయిన బస్సు యాత్ర ఫార్ములాతో కేసీఆర్ మళ్లీ ప్రజలను ఆకట్టుకోగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దారుణంగా చెల్లాచెదురైంది. అటు బీజేపీలోకి, ఇటు కాంగ్రెస్‌లోకి కీలక నేతలు, కేడర్ వలస వెళ్లడంతో గులాబీ కోట బలహీనపడింది. ప్రస్తుతం కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న జాప్యం, ప్రజల్లో కనిపిస్తున్న చిన్నపాటి అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి కేసీఆర్ వాగ్ధాటి ఉపయోగపడుతుందని భావిస్తున్నప్పటికీ.. జనం గతాన్ని అంత సులభంగా మర్చిపోతారా అనేది అనుమానమే.

బీఆర్ఎస్ పుంజుకోవడమే కీలకం

కేసీఆర్ బస్సు యాత్ర కేవలం ఒక ప్రచార పర్వం మాత్రమే కాదు, అది బీఆర్ఎస్ పార్టీకి జీవన్మరణ సమస్య. కేటీఆర్, హరీష్ రావు ఎంతగా కష్టపడుతున్నా.. పార్టీని నడిపించే  కరిష్మా  కేవలం కేసీఆర్‌కు మాత్రమే ఉంది. ఈ యాత్ర ద్వారా ఆయన తన పాత ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోగలిగితే తెలంగాణలో మళ్లీ ముక్కోణపు పోటీ వస్తుంది; లేదంటే తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోయి బీఆర్ఎస్ మరింత మూలనపడే ప్రమాదం ఉంది. అందుకే కేసీఆర్ సీరియస్‌గా  ఈ యాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి.