KCR Jagityala meeting: జగిత్యాల వేదికగా సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన  ప్రజా ఆశీర్వాద సభ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంఖారావం పూరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడుతూ, భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  హైడ్రాపై తొలి సంతకం 

Continues below advertisement

తాము మళ్ళీ అధికారంలోకి రాగానే  హైడ్రా  వ్యవస్థను మొదటి సంతకంతోనే రద్దు చేస్తానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తన మరణాన్ని కోరుకుంటున్న ప్రత్యర్థులకు చురకలు వేస్తూ..  నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను.. ప్రజల దీవెనలు ఉన్నంత వరకు నన్నెవరూ ఏమీ చేయలేరు  అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి పడదని, తెలంగాణా అభివృద్ధి కోసం తన శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.  

నీళ్ల కష్టాలపై ఆగ్రహం 

తెలంగాణను తాము పదేళ్లలో అభివృద్ధి పథంలో నడిపించామని, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామని సవాల్ చేసి నెగ్గామని గుర్తుచేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఐదేళ్లు పుష్కలంగా వస్తే.. ఇప్పుడు ఏ రోగం పుట్టి నీళ్లు రావడం లేదు  అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీళ్ల కోసం ప్రజలు పోరాడాలని, అధికారులను నిలదీయాలని పిలుపునిచ్చారు. సాగునీరు, తాగునీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

జీవన్ రెడ్డి చేరిక - కొత్త బాధ్యతలు 

45 ఏళ్ల తన మిత్రుడు టి. జీవన్ రెడ్డి పార్టీలో చేరడాన్ని కేసీఆర్ చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తూ, ఆయనను పార్టీ  ప్రధాన కార్యదర్శి గా నియమిస్తున్నట్లు వేదికపైనే ప్రకటించారు. కేవలం జగిత్యాలకే పరిమితం కాకుండా పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల బాధ్యతలను జీవన్ రెడ్డి చూడాలని కోరారు. ఆయన చేరికతో పార్టీకి నూతన ఉత్తేజం వచ్చిందని, సర్వేలన్నీ బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.   

 వయసు కేవలం అంకె మాత్రమే 

జీవన్ రెడ్డి తన వయసు 75 ఏళ్లు అని చెప్పగా, కేసీఆర్ దానిని ఆసక్తికరంగా మళ్లించారు. మీకు ఇప్పుడు 50 ఏళ్లే.. ఇవాల్టి నుంచి మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయింది  అంటూ ఉత్సాహపరిచారు. తనకూ 72 ఏళ్లు వచ్చాయని, తెలంగాణ ప్రజలు తలెత్తుకుని బతికే దాకా తమ సేవలు కొనసాగుతాయని చెప్పారు. ఆరు నూరైనా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పుడు జీవన్ రెడ్డికి సముచిత పదవులు దక్కుతాయని హామీ ఇచ్చారు. అయితే మేడిగడ్డ అంశంపై మాత్రం కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తన హయాంలో పథకాలు.. ప్రాజెక్టుల గురించి చాలా సేపు చెప్పారు కానీ..కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావించకపోవడం విశేషంగా మారింది.