Munugode Poll Result BRS :    తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ఎన్నికల సంఘం ఆమోదం పడక ముందే మునుగోడు ఉపఎన్నిక ఎన్నిక వచ్చింది.  ఓ రకంగా ఇది టీఆర్ఎస్‌కు సవాలే. ఉపఎన్నికలో గెలవకపోతే.. బీఆర్ఎస్ కు ఈసీ అనుమతి లభించినా ఎలాంటి హైప్ ఉండదు. మొదట్లోనే అదీ కూడా సొంత రాష్ట్రంలో ఉపఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ దేశవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపిస్తుందని తేలిగ్గా తీసుకునేవారు. కానీ ఇప్పుడు జరిగింది వేరు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను టాప్ గేమ్‌లో దేశ రాజకీయాల్లోకి దూకించడానికి కేసీఆర్‌కు కావాల్సినంత బలం సమకూరింది. 


నెల రోజుల కిందట టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా మార్చుతూ నిర్ణయం 


దసరా పండుగ రోజున మంచి ముహుర్తం చూసుకుని తెలంగాణ రాష్ట్ర సమతిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేసీఆర్ తీర్మానం చేశారు. ఈ తీర్మానం ప్రతిని తర్వాతి రోజే ఎన్నికల సంఘానికి పంపారు. ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఈ పాటికి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ అయ్యేది . కానీ  ఇంకా ఎన్నికల సంఘం అనుమతించలేదు. ఇవాళ కాకపోతే రేపైనా అనుమతిస్తారని టీఆర్ఎస్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. ఎందుకంటే  పేరు మార్పు అనేది రాజకీయ పార్టీల ఇష్టం. ఎవరికీ అభ్యంతరం లేకపోతే.. మార్చవద్దని చెప్పడానికి ఈసీకి అధికారాలు ఉండవు. అయితే భారత రాష్ట్ర సమితి పేరుతో మరికొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. అందుకే బహిరంగ ప్రకటన ద్వారా ఎవరికీ అభ్యంతరం లేదని ఖరారు చేసుకున్న తర్వాత .. బీఆర్ఎస్‌ విషయంపై ఈసీ నోటిఫికేషన్ జారీ చేయవచ్చు. 


దేశ రాజకీయాల్లో ఎంట్రీ అద్దిరిపోయేలా ఉండాలనుకుంటున్న కేసీఆర్!


భారత రాష్ట్ర సమితి గురించి తీర్మానం చేశారు కానీ.. కేసీఆర్ ఆ పార్టీ గురించి ఇంత వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తీర్మానం జరిగిన తర్వాత ఒక్క సారి ప్రెస్ మీట్ పెట్టారు కానీ.. ఆయన భారత రాష్ట్ర సమితి గురించి మాట్లాడలేదు. ఫామ్ హౌస్ ఫైల్స్ గురించి మాత్రమే మాట్లాడారు. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి గురించి చర్చ జరగాలని అనుకుంటున్నారు కానీ.. జెండా, ఎజెండా మాత్రం ఓ రేంజ్‌లో ప్రకటించాలని అనుకుంటున్నారు. అది కూడా జాతీయ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు. అందుకే ముందు తాను పెట్టే ప్రెస్ మీట్ పార్టీదే అయి ఉండాలని... ఫామ్ హౌస్ ఫైల్స్ కూడా హైదరాబాద్‌లోనే విడుదల చేశారు. బీఆర్ఎస్‌కు గుర్తింపు వచ్చిన తర్వాత ఢిల్లీలో భారీ స్థాయిలో బహిరంగసభ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడులో ఓటమి ఎదురయి ఉంటే.. అంత ఉత్సాహంఉండేది కాదు.. కానీ ఇప్పుడు మాత్రం జోష్ ఢిల్లీ వరకూ ఉంటుంది. 


జాతీయ పార్టీలు ఇక కేసీఆర్ వైపు చూస్తాయా ?


కారణం ఏదైనా కావొచ్చు కానీ టీఆర్ఎస్ విషయంలో దేశవ్యాప్తంగా నెగెటివ్ ప్రచారం జరిగింది. కేసీఆర్ వెనుకబడి ఉన్నారన్న ఓ అభిప్రాయాన్ని కల్పించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలవడం ఓ కారణం కావొచ్చు. అయితే  ఇప్పుడు సీన్ మారిపోయింది. మునుగోడులో సిట్టింగ్ సీటు కాకపోయినా గెల్చుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు.. కేసీఆర్‌తో స్నేహానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంది.  బీఆర్ఎస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యే చాన్స్ ఉంది. మునుగోడు ఎన్నికల ఫలితం ద్వారా కేసీఆర్.. కేవలం తెలంగాణలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రయోజనం పొందబోతున్నారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.