ఏపీలో రాజకీయవాతావరణం మారిపోతోంది. నిన్నటి వరకు టిడిపి, వైసీపీ, జనసేన మధ్యే ప్రధాన పోరు అనుకుంటే ఇప్పుడు కొత్తగా మరోపార్టీ వచ్చేస్తోంది. ఇంకా ఆంధ్రలో అడుగు కూడా వేయకుండానే మాదే అధికారం అన్న రేంజ్‌లో మాట్లాడేస్తోంది బీఆర్‌ఎస్‌. గులాబీ నేతల మాటల్లోని ఈ దమ్ముని చేతల్లో చూపిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.


తెలంగాణలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కీ రోల్‌ పోషించే పార్టీగా ఉండాలన్నది గులాబీ బాస్‌ లక్ష్యం. అందులో భాగంగానే బీఆర్‌ ఎస్‌ పార్టీని పెట్టారు. త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికలతో కేంద్ర రాజకీయాల్లోకి దిగి సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కెసిఆర్‌ చూపు ఏపీపై పడటమే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగురాష్ట్రాలుగా విడిపోవడం వెనక కెసిఆర్‌ ఉన్నారన్న విషయం  తెలిసిందే. ఆయనపై ఆంధ్రలో ద్వేషం ఇప్పటికీ ఉందా ? బీఆర్‌ఎస్‌ పార్టీని ఆంధ్రులు ఆదరిస్తారా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించే లోపే ఏపీకి చెందిన పలు వర్గాలు కెసిఆర్‌ని కలవడం..ఏపీలోకి బీఆర్‌ఎస్‌ని ఆహ్వానించడం జరిగిపోయాయి. ఇది చాలదన్నట్లు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ పార్టీ  ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాపు నేత తోట చంద్రశేఖర్‌ ని నియమించడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.


ఊహించని విధంగా మెరుపు వేగంతో కెసిఆర్‌ ఏపీలో పార్టీని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే చేరికలతో మొదలైన ఊపుని మరింత పెంచే దిశగా గులాబీ నేతల మాటలు ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తున్నాయి. 


కాపు జపం కలిస్తొస్తుందా? 


ప్రస్తుతం ఆంధ్రలోని అధికార, విపక్షాలు కాపు రిజర్వేషన్‌లపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఆ వర్గం ప్రజలను ఆకట్టుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉంటే బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కాపు జపం చేస్తూనే మూడు అంశాలపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టిందన్న విషయం గులాబీ నేతల మాటల్లోనే లీకైపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి చేయడం, అమరావతినే రాజధానిగా చేస్తామన్న అంశాలతో  బీఆర్‌ఎస్‌ పార్టీ రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి రాబోతోందన్న సంకేతాలను ఆపార్టీ ఇచ్చేసింది. మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలనే హైలెట్‌ చేయబోతోందట. వీటితోపాటు తెలంగాణలో అమలు చేస్తోన్న పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏపీలో తీసుకువస్తామన్న హామీని కెసిఆర్‌ ఇవ్వనున్నారని తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఏపీలోని అన్ని స్థానాలకు పోటీ చేయాలన్న లక్ష్యంతో వస్తున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. 


ఎవరికి లాభం? ఎవరికి నష్టం? 
బీఆర్‌ఎస్‌ రాకపై స్పందించిన అధికారపార్టీ ఏపీలో ఆపార్టీకి అంత సీన్‌ లేదంటోంది. అంతేకాదు వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఈసారి కూడా మాదే అధికారమని ఆపార్టీ నేత కొడాలి నాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు టిడిపి-జనసేన కూడా బీఆర్‌ఎస్‌ ఎంట్రీపై ఆచితూచి స్పందిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ రాకతో ఎవరికి లాభం..ఎవరికి నష్టం అన్నది పక్కన పెడితే అసలు కెసిఆర్‌ నాయకత్వాన్ని ఏపీ ప్రజలు అంగీకరిస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.