India vs Bharat: ఇండియా వర్సెస్ భారత్ దేశవ్యాప్తంగా రాజీకయ రచ్చకు కారణమైంది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, ప్రతిపక్షం కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా వర్గాల మధ్య పరస్పర విమర్శలు, సటైర్లు, పంచులు విసురుతున్నారు. బీజేపీ ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మారిస్తే ప్రతిపక్ష కూటమి పేరు I.N.D.I.A ను సైతం B.H.A.R.A.T మారుస్తామంటూ కూటమి నేతలు గట్టిగా సమాధానమిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము G20 అధినేతలకు పంపిన విందు ఆహ్వానాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీరుపై ప్రతిపక్షాల నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.. కేంద్రం ఇండియా పేరును భారత్‌గా మారిస్తే తాము కూటమి పేరును I.N.D.I.A బదులుగా బెటర్‌మెంట్, హార్మొనీ అండ్ రెస్పాన్సిబుల్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ టుమారో (B.H.A.R.A.T) అని పిలుస్తామని ఎక్స్ (ట్విటర్‌లో)లో పేర్కొన్నారు.
రాజ్యాంగంలో ఇండియా, భారత్ అనే రెండు పేర్లు రాసి ఉన్నాయని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ప్రధాని ప్రయాణించే విమానంపై భారత్ అని రాసి ఉందన్నారు. దేశానికి ఇంకా ఎన్ని పేర్లు మారుస్తారని ప్రశ్నించారు. దేశానికి నష్టం కలిగించడం తమకు ఇష్టం లేదని, ఒక వేళ ప్రతిపక్షాలు I.N.D.I.A అని పేరు పెట్టుకున్నందుకే దేశం పేరు మారిస్తే తాము కూడా కూటమి పేరు B.H.A.R.A.T మారుస్తామన్నారు.
దానిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శలు ఎక్కుపెట్టారు. 'ఆసియాన్-ఇండియా సమ్మిట్', 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్' అని రాయడంలో ‘‘మోదీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి! ప్రతిపక్షాల పేరును I.N.D.I.A అని పిలవడం వల్లే మోదీ ఇదంతా డ్రామా ఆడుతున్నారు' అని సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 పార్టీల కూటమిని ‘I.N.D.I.A’ అని వల్లే దేశం పేరును భారత్‌గా మారుస్తోందని మండిపడ్డారు. తమ కూటమి పేరును 'భారత్'గా మార్చాలని నిర్ణయించుకుంటే కేంద్రం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ‘విపక్షాలు కూటమిగా ఏర్పడి I.N.D.I.A అని పేరు పెట్టుకుంటే కేంద్రం దేశం పేరు మారుస్తుందా? దేశం ఒక్క పార్టీకి కాదు 140 కోట్ల మంది ప్రజలది. కూటమి పేరును భారత్‌గా మార్చేస్తే, వారు భారత్ పేరును బీజేపీగా మారుస్తారా?’ అని ఆప్ చీఫ్ ప్రశ్నించారు.
మంగళవారం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా స్పందిస్తూ.. వచ్చే సమావేశంలో I.N.D.I.A కూటమి పేరును తమను తాము B.H.A.R.A.T మార్చే ఆలోచనలో ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశానికి కొత్త పేరు గురించి ఆలోచించాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి నుంచి G20 అధినేతలకు విందు ఆహ్వానం వెలువడినప్పడి నుంచి బీజేపీ దేశం పేరు మార్చేందుకు యత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇందుకోసమే సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎజెండాను ప్రకటించకపోవడం ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. దీనిపై మంత్రులు ఎవరూ స్పందించవద్దని మోదీ ఆదేశించినట్లు సమాచారం.