సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంత మంది ఓటర్లు ఉంటారు ?. రెండు నుంచి రెండున్నర లక్షల మంది ఓటర్లు ఉంటారు. అదే గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో అయితే నియోజకవర్గానికి యాభై వేల మంది ఓటర్లుకూడా ఉండరు. అలాంటిది.. మెజార్టీ లక్షల్లో రావడం సాధ్యం కాదు. ఏడెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి ఉండే లోక్‌సభ ఎన్నికల్లోనే .., వేలల్లో మెజార్టీ వస్తే గొప్ప. పాతుకుపోయిన నేతలయితే లక్షల్లో మెజార్టీ తెచ్చుకుంటారు. అదే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే.. ఎంత పాతుకుపోయిన లీడర్లకయినా లక్ష ఓట్లు మెజార్టీ తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే... పోలయ్యే ఓట్లు ఆ స్థాయిలో ఉండవు మరి. 


కానీ ఉత్తరప్రదేశ్‌లో తాజాగా గెలిచిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మెజార్టీలో అన్ని జాతీయ రికార్డులను బద్దలు కొట్టే మెజార్టీ సాధించారు. యూపీలోని షాబిబాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన సునీల్ కుమార్ శర్మ విజయం సాధించారు. అది అలా ఇలా కాదు.,. ఏకంగా రెండు లక్షల పధ్నాలుగు వేల ఎనిమిది వందల ముఫ్ఫై ఐదు ( 2, 14, 835 ) ఓట్ల మెజార్టీతో తన సమీప సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. యూపీలో గెలిచిన అందరు అభ్యర్థుల కంటే ఇది ఎక్కువ. గతంలో ఎవరూ ఇంత మెజార్టీ సాధించలేదు. యూపీలోనే కాదు.., దేశంలో మరెక్కడ నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ మెజార్టీతో విజయం సాధించిన దాఖలాల్లేవు. 


షాహిబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం దేశంలో ఉన్న అతి పెద్ద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. సహజంగానే అక్కడ అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లలో అరవై ఏడు శాతం సునీల్ కుమార్ శర్మకే పడ్డాయి. ఆయనకు మొత్తం మూడు లక్షల 22 వేల ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అమర్‌పాల్ శర్మకు లక్షా ఎనిమిదివేల ఓ్టలు మాత్రమే వచ్చాయి. సునీల్ కుమార్ శర్మ రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2017లోనూ షాహిబాబాద్ నుంచి ఆయనే గెలిచారు. కానీ అప్పట్లో ఆయనకు ఎస్పీ అభ్యర్థి అయిన తాజా ప్రత్యర్థి అమర్ పాల్ శర్మ కాస్త పోటీ ఇచ్చారు. లక్ష ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. 


అత్యధిక మెజార్టీ సాధించిన రికార్డు సృష్టించిన సునీల్ కుమార్ శర్మ అజేయుడేమీ కాదు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై గెలిచింది.. ఇప్పటికి రెండు సార్లు ఓడిరపోయిన ప్రస్తుత ప్రత్యర్థి అమర్ పాల్ శర్మనే. మొత్తంగా యూపీలో బీజేపీ వేవ్‌లో భారీ మెజార్టీలు చాలా మంది సాధించారు. వారిలో చాంపియన్ గా సునీల్ కుమార్ శర్మ నిలిచారు.