2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే వస్తాయంటూ ప్రధాని మోదీ ( PM Modi ) చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( PK )  కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ పేరను ఎక్కడా ప్రస్తావించకుండా ట్వీట్ చేశారు. "సాహెబ్"గా అభివర్ణిస్తూ  మోదీ వ్యాఖ్యలను త‌ప్పుప‌ట్టారు. మోదీ వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసినవే అని ఆరోపించారు. రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలను ( ASssembly Election Results ) బేస్‌ చేసుకొని బీజేపీవైపు ఓటర్లను ఆకర్షించేందుకే ప్రధాని మోదీ తెలివిగా ఇలా మాట్లాడారని అన్నారు. ఈ విషయం సాహెబ్‌కు కూడా తెలుసంటూ  విమర్శలు చేశారు.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫలితాలు ఆ ఏడాదిలోని పరిణామాల వల్ల డిసైడ్ అవుతుంది తప్ప రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా కాదని కౌంటర్‌ ఇచ్చారు. ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని తెలిపారు. 


 






ప్రశాంత్ కిషోర్ ( Prasant Kishore ) కొంతకాలంగా బీజేపీ వ్యతిరేక పక్షాలకు పని చేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీకి పని చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షంగా ఏ పార్టీకి పని చేసేందుకు అంగీకరించడం లేదు. కానీ తన ఐ ప్యాక్ ద్వారా దేశంలో అనేక పార్టీలకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పక్షాలను ఏకం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ( Congress Party ) చేరుతారని ప్రచారం జరిగినా ఆయన చేరలేదు.  ఇప్పుడు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే కూటమిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్‌తో వరుసగా రెండు రోజుల పాటు సమావేశమయ్యారు. మోదీకి  ప్రత్యామ్నాయ నేతను సిద్ధం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఈ క్రమంలో ఆయన కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని అనుకున్నారని కానీ రివర్స్‌లో వచ్చే సరికి ఆయన అంచనాలు తప్పాయన్న భావనలో ఉన్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ పోల్ స్ట్రాటజీ ఈ సారి వర్కవుట్ కాలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.