UP Election Result 2022: ఎగ్జిట్ పోల్స్ చెప్పిందే నిజమైంది.. ఉత్తర్‌ప్రదేశ్‌ మళ్లీ భాజపా వశమైంది. దేశ రాజకీయాలను శాసించే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లలో భాజపా, అప్నాదల్ కూటమి 267 స్థానాలను కైవసం చేసుకొని స్పష్టమైన మెజారిటీని సాధించింది.


భాజపాకి 255 సీట్లు, అప్నాదల్‌కు 12 సీట్లు దక్కాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు సాధించిన కమలనాథులకు ఈసారి సీట్లు తగ్గినా ఓట్లు పెరగడం విశేషం. అయితే మరోసారి సీఎం అవ్వాలని ఆశించిన అఖిలేశ్ యాదవ్‌కు నిరాశే మిగిలింది.


ఎస్పీ కూటమికి


ఎస్పీ, ఆర్‌ఎల్డీ కూటమికి 119 స్థానాలు దక్కాయి. ఎస్పీ 111 స్థానాల్లో ఆర్‌ఎల్డీ 8 స్థానాల్లో విజయం సాధించాయి. 2017 ఎన్నికల్లో 47 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. కర్హాల్ స్థానంలో పోటీ చేసిన సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ 60 వేల మెజార్టీతో విజయం సాధించారు.


పత్తా లేదు


మరోవైపు భాజపా దెబ్బకు కాంగ్రెస్‌, బహుజన సమాజ్‌ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.


యోగి రికార్డు


తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో లక్షా రెండు వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.


> ఉత్తర్‌ప్రదేశ్‌ చరిత్రలో ముగ్గురు సీఎంలు మాత్రమే ఐదేళ్ల పూర్తికాలం పాలించారు.వీరిలో యోగి ఆదిత్యనాథ్ మూడో వ్యక్తి.


> యూపీలో గత 15 ఏళ్లలో తొలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా యోగి రికార్డ్. యూపీకి గత 15 ఏళ్లుగా ఎమ్మెల్సీలే సీఎంలుగా ఉన్నారు.


> యూపీలో 37 ఏళ్ల తర్వాత అధికారం నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు.


> యూపీని ఇప్పటివరకు పాలించిన నలుగురు ముఖ్యమంత్రుల్లో యోగి మాత్రమే అధికారాన్ని కాపాడుకున్నారు.


Also Read: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అఖండ విజయం ఏం చెబుతోంది?


Also Read: Election 2022: బీజేపీని పడగొట్టడం ఇక ఎవరి వల్లా కాదా...?