GVL Comments : ప్రముఖ పర్యాటక ప్రదేశంగా ఉన్న విశాఖ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెడగొడుతోందని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన రుషికొండ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే టూరిస్టు డెస్టినేషనుగా విశాఖకు ఉన్న పేరు చెడగొట్టేలా ఉందన్నారు. స్వచ్ఛభారత్ నిధులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విశాఖ నగరం అంతా మురికిమయంగా ఉంది..బీచ్ అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ బీచ్ లో బిజెపి స్వచ్ఛభారత్ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా ప్రకటించారు.
రుషికొండకు ఉన్న బ్లూ ఫ్లాగ్ టూరిజం హోదాను చెడగొడతారా ?
రుషికొండ టూరిజం రిసార్టు పునర్నర్మాణం వెనక కుంభకోణం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వక్ర భాష్యాలు చెపుతున్నారుని మండిపడ్డారు. సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా అక్కడ ఏడునక్షత్రాల రిసార్టు నిర్మాణం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లిలో కాంగ్రెస్ నేతలు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కోసం డమ్మీ కంపెనీ పెట్టారు. ఇక్కడ కూడా ఈ వైఎస్ఆర్‌సీపీ అలాంటి స్కెచ్చే వేసిందా అని ప్రశ్నించారు. అదే గాని జరిగితే బిజెపి ఊరుకోదని హెచ్చరించారు. రుషికొండకు ఇప్పటి వరకూ బ్లూ ఫ్లాగ్ టూరిజం హోదా ఉంని దాన్ని చెడగొట్టేలా ఉన్నారన్నారు.
రోడ్ల కోసమే రూ. ఎనిమిది లక్షల కోట్లు ఇచ్చిన కేంద్రం
ఏపీలో ఇపుడే కాదు. రాష్ట్ర విభజన నాటినుంచీ కేంద్ర అభివృద్ధే తప్ప రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధే లేదని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో రహదారులకే కేంద్ర ప్రభుత్వం రూ. 8.16 లక్షల కోట్లు కేటాయించారన్నారు. జాతీయ రహదారులు రెట్టింపుకన్నా ఎక్కువ అయ్యాయని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకి అధిక నిధులు ఇచ్చి విభజన నష్టాలు పూరించామని స్పష్టం చేశారు. అదే సమయంలో పేదల కోసం 20.74 లక్షల ఇళ్లు ప్రధానమంత్రీ ఆవాస్ యోజన కింద ఏపీకి లభించాయనన్నారు.
ఏపీలో అధికారంలోకి రావడం ఖాయం !
ప్రధాని ఎన్ని పధకాలు పెడితే అన్నిటా ఏపీకి పెద్ద పీట వేశామని.. ప్రజలకు ఈ విషయాలు చెప్పటానికి ఇంటింటి ప్రచారం చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. జూన్ ఆరు, ఏడు తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షులు నడ్డా ఏపిలో పర్యటిస్తారని.. ఆరున విజయవాడలో పార్టీ సమావేశం, ఏడున రాజమండ్రిలో బహిరంగ సభ జరుగుతాయని జీవీఎల్ ప్రకటించారు. జులై నాలుగున ప్రధాని మోది అల్లూరి సీతారామరాజు జన్మ స్థలమైన భీమవరం వస్తారు. ఆజాదీకా అమృత మహోత్సవాల్లో పాల్గొంటారన్నారు. ఏపీ మీద మేము దృష్టి కేంద్రీకరించాం. ప్రజలు మోదీజీ సుపరిపాలనను గుర్తించారు. బిజెపి జనసేనల కూటమి 2024 లో అధికారానికి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.