Next Generation Leaders in BJP National Team:  భారతీయ జనతా పార్టీ  లో ఊహించని రీతిలో సమూల ప్రక్షాళనకు తెరలేచింది. కేవలం కేంద్ర మంత్రివర్గంలోనే కాదు.. అటు పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ పెను మార్పులు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ద్వయం గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, అమిత్ షాల తర్వాత ఢిల్లీ బీజేపీలో అత్యంత శక్తివంతమైన చక్రం తిప్పుతున్న జాతీయ  సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను ప్రస్తుత బాధ్యతల నుంచి పక్కన పెట్టే ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు  ప్రచారం జరుగుతోంది.  సుదీర్ఘ కాలంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను, టికెట్ల కేటాయింపులను, ఎన్నికల వ్యూహాలను శాసిస్తున్న ఆయనను తిరిగి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  మాతృ సంస్థకు పంపేందుకు తెరవెనుక ముమ్మర కసరత్తు జరుగుతోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.  నెక్స్ట్ జనరేషన్ లీడర్‌షిప్ 

Continues below advertisement

బీఎల్ సంతోష్ ను మార్చడం  కేవలం ఒక వ్యక్తిని మార్చడం కాదు, ఇది రాబోయే 15-20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ వేస్తున్న ఒక చారిత్రాత్మక అడుగు. ప్రస్తుతం 70 ఏళ్ల వయస్సుకు చేరువవుతున్న సీనియర్ నేతల స్థానంలో, సాంకేతికతపై పట్టు ఉండి, మారుతున్న యువ భారతదేశ ఓటర్ల నాడిని పట్టుకోగల నెక్స్ట్ జనరేషన్   లీడర్లను కీలక స్థానాల్లో కూర్చోబెట్టాలని మోదీ-షా భావిస్తున్నారు. పార్టీని తదుపరి తరానికి సజావుగా పాస్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ సంస్థాగత శస్త్రచికిత్సకు శ్రీకారం చుట్టారని ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. 

 కర్ణాటక దెబ్బ.. వ్యూహాల బెడిసిపాటు! 

Continues below advertisement

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ కోటా నుండి వచ్చి బీజేపీ జాతీయ సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బీఎల్ సంతోష్.. పార్టీలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అయితే, గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడియూరప్ప లాంటి మాస్ లీడర్లను కాదని ఆయన అనుసరించిన కొన్ని క్షేత్రస్థాయి వ్యూహాలు పార్టీని ఘోరంగా దెబ్బతీశాయనే అసంతృప్తి అధిష్ఠానంలో బలంగా నాటుకుపోయింది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ గేట్‌వే అయిన కర్ణాటకను చేజార్చుకోవడం, అలాగే కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో టికెట్ల పంపిణీలో లోపాలు ఉండటం వల్లే పార్టీ ఆశించిన మెజారిటీని సొంతంగా సాధించలేకపోయిందనే ఇంటెలిజెన్స్ నివేదికలు మోదీ-షాలకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్‌లో సరికొత్త రక్తాన్ని ఎక్కించక తప్పదని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారు. 

 సంఘటనా కార్యదర్శి పదవి ఎంత కీలకం? 

బీజేపీ లేదా సంఘ్ పరివార్ వ్యూహాల్లో జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి పదవి అత్యంత శక్తివంతమైనది. ఈ స్థానంలో ఉన్న వ్యక్తి నేరుగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి,  బీజేపీ అధినాయకత్వానికి మధ్య ఒక బలమైన వంతెనలా పనిచేస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి కంటే కూడా అంతర్గత నియామకాలు, క్రమశిక్షణ చర్యలు,  రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌ల నివేదికలపై ఈ పదవిలో ఉన్న వ్యక్తికే ఎక్కువ పట్టు ఉంటుంది. గతంలో కుశభావ్‌ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా, ఆ తర్వాత సంజయ్ జోషి, రామ్ లాల్ వంటి దిగ్గజాలు పనిచేసిన ఈ స్థానంలో మార్పు జరుగుతోందంటే.. పార్టీ సిద్ధాంత పరంగా, శైలి పరంగా చాలా పెద్ద మలుపు తిరగబోతోందని అర్థం. 

 ఆర్ఎస్ఎస్ - బీజేపీ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే వ్యూహం! 

ఇటీవలి కాలంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తదితర ప్రముఖులు చేసిన కొన్ని వ్యాఖ్యలు, బీజేపీ అంతర్గత  అంశాలపై విమర్శలు చేశారు. క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ,  బీజేపీ నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. బీఎల్ సంతోష్ హయాంలో సంఘ్‌కు, పార్టీకి మధ్య ఒక విధమైన కోల్డ్ వార్ నడిచిందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు సంతోష్‌ను తిరిగి ఆర్‌ఎస్‌ఎస్‌కు పంపి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యుడైన సరికొత్త, సౌమ్యుడైన వ్యూహకర్తను ఆ స్థానంలో పెట్టడం ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను మళ్లీ ఎన్నికల పోరాటాల్లో యాక్టివ్ చేయాలని మోదీ భావిస్తున్నారు. 

 మోదీ 3.0 లో ఊహించని మార్పులు

మొత్తానికి మోదీ 3.0 ప్రభుత్వ హయాంలో అటు కేబినెట్, ఇటు పార్టీ ఐడెంటిటీని పూర్తిగా మార్చేసే లాంగ్ టర్మ్ ప్లాన్ అమలవుతోంది  కీలకమైన ప్రధాన కార్యదర్శుల మార్పుల ద్వారా సరికొత్త టీమ్ మోదీ   రూపుదిద్దుకోనుంది. పాత సంకెళ్లను తెంచుకుని, కేవలం పనితీరు,  గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తూ బీజేపీ చేయబోతున్న ఈ మహా ప్రక్షాళన.. మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సంకేతాన్ని పంపుతోంది.