BJP : అధికారపార్టీని ఇరుకున పెట్టాల్సిన సమయంలో ఇంటిపోరుతో విపక్షాలన్నీ విలవిలలాడుతున్నాయి. ఇప్పటివరకు ఈ లిస్ట్ లో కాంగ్రెస్ ఉందనుకుంటే ఇప్పుడు కాషాయం కూడా ఉన్నానని వార్తల్లో నిలుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన బీజేపీ నేతలు పదవుల కోసం పొట్లాడుకుంటూ పరువు తీసుకుంటున్నారు. నిన్నటివరకు కాంగ్రెస్ నేతలు ఇంటిపోరుతో అల్లాడిపోయారు. సీనియర్లు, వలసదారులు అనుకుంటూ రోడ్డున పడ్డారు. ఈ కొట్లాట తీరుతో పార్టీ కార్యకర్తలే కాదు చివరకు ప్రజలు సైతం విసిగిపోయి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేస్తున్నారు. కానీ తీరు మారలేదు. తన్నుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రోగం బీజేపీకి అంటుకుంది.
తెలంగాణ బీజేపీలో పెరుగుతున్న ఇంటి పోరు !
తెలంగాణలో అధికార పార్టీ అంతు చూస్తామని ఓ వైపు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాళ్లు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా అధిష్టానం కూడా సీనియర్లందరినీ ఒక్కొక్కరిని దింపుతూ వ్యూహరచనలతో ముందుకెళ్తోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారమైనా అందుకోవాలి లేదంటే కేసీఆర్‌కి బలమైన ప్రతిపక్షంగానైనా మారాలన్న కసితో ఉండాలని కాషాయం పెద్దలు రాష్ట్ర నేతలకు బోధిస్తున్నారు. ఇలాంటి టైమ్ లో సఖ్యతగా ఉండాల్సిన బీజేపీ లోకల్ లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్ లో కొట్లాడుకుంటున్నారు. దుబ్బాకలో బీజేపీ ఇంటిపోరు రోడ్డుపడింది. రఘనందన్ రావుకి వ్యతిరేకంగా సీనియర్లు ఏకమయ్యారు. పార్టీని నమ్ముకున్న వారికి రఘనందన్ అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ సీనియర్లంతా రహస్య భేటీ అయ్యారట. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర బీజేపీ నేతల్లోనూ కొరవడిన సఖ్యత !
దుబ్బాకలోనే కాదు రాష్ట్ర బీజేపీ నేతల్లో చాలామందికి సఖ్యత లేదన్న వాదన ఉంది. ఈ మధ్యన విజయశాంతి డైరక్ట్ గానే అసంతృప్తిని వెళ్లగక్కారు. కొంత మంది ఇమడలేక తిరిగి ఏ పార్టీ నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోతున్నారు. ఈ మధ్యనే స్వామి గౌడ్ తిరిగి టీఆర్ ఎస్ లోనే చేరారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకునేలా మిషన్ 90 పేరుతో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే బలమైన బీఆర్ఎస్‌ను ఓడించడం 90 సీట్లలో బీజేపీ పాగా వేయడం సాధ్యమేనా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీకి ఊపు వచ్చినప్పటికీ బలమైన అభ్యర్థులు మాత్రం కనిపించడం లేదు. బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. ఆ పార్టీ కేవలం కొన్ని పట్టణాలకే పరిమితమైంది. గ్రామస్థాయిలో కేడర్ లేరు. మండల జిల్లా స్థాయిలోనూ చాలా చోట్ల లీడర్లు కరువే. అయినా ఆ పార్టీలో వర్గ పోరాటాలకు కొరతేం లేకుండా పోయింది.
ఏపీ బీజేపీలోనూ అదే వర్గ పోరాటం !
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో బలహీనపడుతోంది. అసలు ఏపీలో ఉనికే లేని ఈపార్టీలో వర్గ పోరు ఎక్కువైంది. సోము వర్సెస్ కన్నా మధ్య ఏర్పడిన విభేదాలు పార్టీ పరువుని రోజురోజుకి దిగజార్చుతోంది. సోము ఏకపక్ష నిర్ణయాలే పార్టీకి నష్టం తెస్తున్నాయని మొన్నా మధ్య మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా ఆరోపించారు. ఇప్పుడు కన్నాపై ఉన్న కసిని బయటపెడుతూ ఆపార్టీ పదాధికారుల సమావేశంలో సోము వీర్రాజు వీరావేశం చూపించారట. పార్టీ నుంచి ఎప్పుడైనా వెళ్లిపోయే వారు అంటూ కన్నాపై విమర్శలు చేశారట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ మాటలు ఆ పార్టీలో నిప్పురాజేస్తున్నాయి. ఓ వైపు పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా మల్చుకోవాలని అధిష్టానం ఆదేశాలు ఇస్తుంటే దాన్ని సీరియస్ గా తీసుకోకుండా పదవి కోసం కన్నా, సోము కోట్లాడుకుంటున్నారన్న టాక్ ఉంది.
తెలుగురాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్న కాషాయానికి బలమైన నేతలు లేకపోవడం ఓ మైనస్ అయితే ఉన్న నలుగురిలోనూ సఖ్యత లేకపోవడం మరో మైనస్. ఇలా అయితే తెలుగురాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ కదు కదా ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ లా కనుమరుగవడం ఖాయమని రాజకీయవిశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.