Andhra Pradesh Latest News: తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం సృష్టిస్తూ ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. శుక్రవారం సోషల్ మీడియాలో విషయాన్ని ప్రకటించిన ఆయన ఈ ఉదయం ఢిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామాకు దారి తీసిన కారణాలు అడిగి తెలుసుకున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌ వెంటనే దాన్ని ఆమోదించారు. 


విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఓ ఎంపీ సీటు ఖాళీ అయింది. వైసీపీకి అసెంబ్లీలో తగిన సంఖ్యా బలం లేనందున ఆ సీటు ఇప్పుడు కూటమికే వెళ్లనుంది. కూటమిలో మొన్నీ మధ్య ఖాళీ అయిన మూడు సీట్లను టీడీపీ, బీజేపీ పంచుకున్నారు. ఇప్పుడు ఖాళీ అయ్యే సీటు వాస్తవంగా అయితే జనసేనకు వెళ్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సీటుపై బీజేపీ కన్నేసింది. 


Also Read: ఆంధ్ర శశికళ ఎవరు? విజయసాయిరెడ్డికి పొమ్మనలేక పొగబెట్టారా?


ఆర్‌ కృష్ణయ్య, బీదమస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాల్లో రెండింటిని టీడీపీ తీసుకుంటే ఒక స్థానాన్ని బీజేపీ కైవశం చేసుకుంది. ఇందులో ఇద్దర్ని పాతవాళ్లకే ఛాన్స్ ఇచ్చారు. మూడో స్థానాన్ని సానా సతీష్ అనే టీడీపీ నేతకు ఇచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కూడా బీజేపీ అడుగుతోంది. 
విజయసాయి రెడ్డితో ఖాళీ అయిన స్థానంలో రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ రేసులో ముందు వరసలో మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు కూడా ఆయన బీజేపీ అధినాయకత్వం నుంచి హామీ లభించినట్టు చెప్పుకున్నారు. ఈయన గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. రాజంపేటలో వైసీపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 


ఈ పోటీకి సిద్ధపడే సమయంలోనే తేడా వస్తే వేరే మార్గంలో రాజ్యసభకు పంపించేందుకు కిరణ్‌కుమార్ రెడ్డికి హామీ లభించిందని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందులో భాగంగా ఈసారి ఖాళీ అయ్యే సీటును కిరణ్‌కుమార్ రెడ్డికి ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఆ సీటు దక్కాల్సిన జనసేన కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ఈ మాజీ ముఖ్యమంత్రి పెద్దల సభలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. 



ఇప్పుడు ఖాళీ అవుతున్నది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీటు, అందుకే ఆ స్థానాన్ని అదే సమాజిక వర్గంలో భర్తీ చేసినట్టు అవుతుంది. మొన్న ఫిల్ చేసిన మూడు స్థానాల్లో సీమకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సీటు సీమకు ప్రయార్టి ఇస్తే లెక్‌ సరి చేసినట్టు భావిస్తున్నారు. అన్నింటి కంటే ముఖ్యమైంది పార్టీ బలోపేతం. కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ సీటు ఇచ్చినట్టు అయితే కచ్చితంగా ఆ సమాజిక వర్గంలో బీజేపీకి మంచి మార్కులు పడతాయని అనుకుంటున్నారు. 


సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నటైంలో లబ్ది పొందిన కొందరు వైసీపీ నేతలు కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూసేందుకు అవకాశం ఉందని కాషాయం పార్టీ లెక్కలు వేసుకుంటుంది. ఇది పార్టీ బలోపేతానికి చక్కని అవకాశంగా మలుచుకోవచ్చని యోచిస్తోంది. ఇన్ని లెక్కలు వేస్తున్నందునే ఈసారి ఖాళీ అయ్యే సీటులో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 


Also Read: జగ‌న్‌తో మాట్లాడాకే రాజీనామా, వెన్నుపోటు పాలిటిక్స్ చేయలేను - విజయసాయిరెడ్డి