BJP Prajaporu : భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం బలం లేని రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టడం వెనుక వారికి మాత్రమే సాధ్యమైన ప్రత్యేకమైన వ్యూహం ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఉన్న చోట కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఆయా రాష్ట్రాల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలతో పాటు ప్రచారం పెద్దగా లేకుండా సైలెంట్‌గా ప్రజల్లోకి వెళ్లడం ఆ పార్టీ వ్యూహాల్లో ఒకటి. త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ప్రతి ఓటర్‌నూ కలిసేందుకు బీజేపీ నేతలు ప్రత్యేక కార్యాచరణ అమలుచేశారు. తమ విధానాలు చెప్పారు. అధికారం చేపట్టారు. ఇప్పుడు ఏపీలోనూ బీజేపీ అదే వ్యూహాన్ని పాటిస్తోంది. 


ప్రజాపోరు పేరుతో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ లు !


భారతీయ జనతా పార్టీ ఏపీలోని ప్రతి ఊరిలో ముఖ్య కూడలిలో ఓ సభ ఏర్పాటు చేస్తోంది. ఆ సభలకు వీలైనంత ప్రముఖ నేతలను ఆహ్వానిస్తున్నారు. కొన్నికొన్ని చోట్ల కేంద్ర మంత్రులుకూడా వచ్చేలా చూసుకుంటున్నారు. వీటిని నాలుగు  రోజులుగా నిర్వహిస్తున్నారు. రోజులుకు మూడు నుంచి నాలుగు వందల చోట్ల నిర్వహిస్తున్నారు. భారీ ప్రచారం చేయకుండా ఆయా వీధుల్లో ఉండేవారిని వచ్చేలా చేసుకుని మోదీ విజయాలు.. దేశానికి మోదీ అవసరం.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలువంటివి చెబుతున్నారు. కుటుంబ పార్టీల వల్ల జరుగుతున్న నష్టాన్ని వివరిస్తున్నారు. 



ప్రజలకు దగ్గరగా బీజేపీ ఉందన్న అభిప్రాయం కల్పించడం !


బీజేపీకి క్యాడర్ కాస్త తక్కువే. వారిలోనూ చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు తక్కువ. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాటిని ప్రస్తుతం బీజేపీ పరిష్కరించుకుని క్యాడర్‌ను యాక్టివేట్ చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో  పాటు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్ నేతలు విస్తృతంగా పర్యటిస్తూండటంతో క్యాడర్ కూడా కార్యక్రమాలు చేపట్టడానికి ఆసక్తి చూపిస్తోంది. ప్రజల్లో కూడా బీజేపీ నేతలు సులువుగా కలసిపోతున్నారు. గతంలో బీజేపీ నేతలు .. క్యాడర్ ప్రజల్ని కలిసేది తక్కువ. ప్రజాపోరు సభల ద్వారా ఇప్పుడు ఏ మూల చూసినా బీజేపీ కార్యకర్తలు కనిపిస్తున్నారు. 


 





 


హైకమాండ్ నుంచి కావాల్సినంత సహకారం !


చురుగ్గా ఉండే యువ నేతలకు ఇటీవలి కాలంలో ఎక్కువగా బాధ్యతలిస్తున్నారు. ప్రజల్లో చర్చ జరిగేలా.. సమస్యలపై చర్చించేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. యువత పార్టీపై ఆసక్తి చూపిస్తున్నందున వారిని మరంతగా కలుపుకునేందుకు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి లాంటి నేతలు చురుకుగా పర్యటిస్తున్నారు. ప్రజాపోరులో వారి భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రజాపోరు సభలకు ఆయన ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ గ్రాస్‌రూట్‌లో బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది సక్సెస్ అయితే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.