Hindupuram BJP : ఏపీ బీజేపీ విషయంలో ఆ పార్టీ హైకమాండ్ ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సొంతంగా పోటీ  చేయడమా, పొత్తులతో పోటీ చేయడమా అన్నదానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కానీ రాష్ట్ర నేతలకు మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పని చేసుకోవాలని  సూచించినట్లుగా చెబుతున్నారు. రాయలసీమలోని హిందూపరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి ఇటీవలి కాలంలో రాజకీయ కార్యకాలాపాలు పెంచారు. ఎన్నికల వరకూ అక్కడే పని చేసుకోవాలని హైకమాండ్ సూచించినట్లుగా చెబుతున్నారు. 


హిందూపురంలో   ఇంటింటికి బీజేపీ విజయాల ప్రచారం
 
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ ఉపాధ్యక్షుడు  విష్ణువర్ధన్ రెడ్డి బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు ప్రభుత్వంపై పోరాటం.. మరో వైపు కేంద్ర సర్కార్ విజయాల ప్రచారం చేస్తూ.. ప్రజల్లోకి . వెళ్తున్నారు.  ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఆయన కార్యాచరణ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం భారత్ ను ప్రపంచశక్తిగా మారుస్తోందని.  ఈ క్రమంలో అనేక విజయాలు సాధిస్తోందని బీజేపీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తోంది.  అలాగే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఏపీలో ఎక్కడైనా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం  కేంద్ర ప్రభుత్వ నిధులే. అయినప్పటికీ ప్రచారం మాత్రం పెద్దగా రావడం లేదు.  ఈ లోపాన్ని గుర్తించిన విష్ణువర్థన్ రెడ్డి హిందూపురం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మోదీ ప్రభుత్వ విజయాలు, రాష్ట్రంలో కేంద్రం సాయంతో జరుగుతున్న పనులు,  పథకాల గురించి వివరించాలని నిర్ణయించారు.  


విద్యుత్ చార్జీల పెంపుపై హిందూపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీ ధర్నాలు


విద్యుత్ చార్జీల పెంపుపై  విష్ణువర్ధన్ రెడ్డి వారం రోజులుగా ధర్నాలు  నిర్వహిస్తున్నారు.   ప్రభుత్వంపై అసంతృప్తి కూడా కనిపిస్తోంది.  విద్యుత్ చార్జీల భారం ప్రజల్ని కుంగదీస్తోంది. ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని గుర్తించిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారు. హిందూపురం పార్లమెంట్ మొత్తం వారం రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తాను స్వయంగా పాల్గొంటున్నారు. కదిరిలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు బీజేపీ కార్యకర్తలే కాక.. స్వచ్చందంగా జనం కూడా తరలి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 


వచ్చే మూడు నెలల పాటు విస్త్రతంగా ప్రచారం


కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పడిన 9 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలపై దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఏపీలోనూ నిర్వహించారు. ఈ ప్రచారంలోనూ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ అనుభవంతో కింది స్థాయి ప్రజలకు కూడా మోదీ ప్రచార విజయాలను తెలియచేయాలని అనుకుంటున్నారు.  వచ్చే మూడు నెలల పాటు హిందూపురం పార్లమెంట్ పరిధిలో బిజేపీ కార్యక్రమాలు విస్తృతంగా జరిగేలా విష్ణువర్దన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు.   గతంలో ఆయన రాష్ట్ర స్థాయి పార్టీ కి ఎక్కువ సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో హిందూపురంలోనే ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.