Konaseema YRCP Leaders: ఏపీలో ఎన్నికల నగరా మరికొన్ని నెలల్లో మోగనున్న వేళ వైఎస్‌ఆర్‌సీపీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల ఎంపికలో సంచలన నిర్ణయాలు తీసుకుటోంది. దీంతో ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల బీపీ పెరిగిపోతోంది. నియోజకవర్గాల్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సోమవారం ఉభయగోదావరి జిల్లాల నేతలతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల మార్పునకు మొగ్గు చూపుతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. వారిలో చాలా మంది తాడేపల్లిలోనే ఉండిపోయి ఎవరికివారు తమ అనుచరులతో మంతనాలు జరుపుతున్నాయి.
విశ్వరూప్‌కు సీటు లేనట్లేనా..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వరూప్ సీటు మార్పు తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో తనకు ఇవ్వకపోయినా తన కుమారుడు శ్రీకాంత్‌కు ఇవ్వాలని విశ్వరూప్ కోరుతున్నట్లు తెలుస్తోంది. అమలాపురంలో ఎవ్వరికి ఇంఛార్చ్ ఇవ్వాలన్న విషయంలో మాత్రం అధిష్టానం ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వరూప్‌కు అమలాపురం టిక్కెట్టు ఇవ్వకపోతే అమలాపురం ఎంపీగా పోటీచేయమనే అవకాశం కానీ పాయకరావుపేటకు వెళ్లమనే సూచన చేయవచ్చని ప్రచారం సాగుతోంది. అమలాపురం సీటు కోసం పార్టీ సీనియర్ నాయకులు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పార్టీ సీనియర్ నాయకుడు కుంచే రమణారావు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరో నాలుగు నియోజవకర్గాల్లో అనుమానమే..
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముందు నుంచి పి.గన్నవరం సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు రాదని ప్రచారం సాగుతోంది. అదే నిజమైనట్టు తెలుస్తోంది. చిట్టిబాబుకు సీటు ఇవ్వలేమని తేల్చిచెప్పారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే చిట్టిబాబు తాడేపల్లిలోనే మకాం వేసి ఎంపీ మిధున్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముమ్మిడివరం విషయంలోనూ సందిగ్ధత వీడడం లేదు. ఈసారి పొన్నాడకు టిక్కెట్టు ఇస్తే ఓడిస్తామని యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చెప్పారు. దీంతో మత్స్యకార ఓట్లు ఎక్కువగా ఉన్న ముమ్మిడివరం విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకునేందుకు అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాపాక వరప్రసాదరావుకే రాజోలు వైసీపీ టిక్కెట్టు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎన్నికైన చెల్లుబోయిన వేణుకు రాజమండ్రి రూరల్ నుంచి పోటీచేయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక మండపేట నుంచి తోట త్రీమూర్తులు పోటీచేయనున్నారు.
కాకినాడ జిల్లాలో ఇదీ పరిస్థితి..
కాకినాడ జిల్లాలో పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌ల మార్పు అనివార్యం అన్నట్లు తెలుస్తోంది. పిఠాపురానికి కాకినాడ ఎంపీ వంగా గీతను ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రత్తిపాడు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా పర్వత జానకీ దేవి, జగ్గంపేట ఇంచార్జిగా మాజీ ఎంపీ తోట నరసింహంకు ఇంచార్జ్ బాధ్యతలు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.
గుంటూరులో 11 మందిని నియామకంతో..
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 11 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను ఈ మధ్యే నియమించారు. ఇందులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. టికెట్ కచ్చితంగా వస్తుందనుకున్న వాళ్లను కూడా పక్కన పెట్టేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిగతా జిల్లాల్లో కలవరం మొదలైంది.