Telangana Alert For New Covid Variant : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ (New Covid Variant) కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన తెలంగాణ ( Telangana) వైద్య ఆరోగ్య శాఖ... కరోనా ( Covid )చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో ఏర్పాట్లు చేసింది. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించారు. కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రాలతో బుధవారం కేంద్రం సమీక్ష
కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రబలుతుండటంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్రం లేఖ రాసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందని లేఖలో ప్రస్తావించింది. కొవిడ్ అప్రమత్తత, ఆసుపత్రుల సన్నద్ధతపై బుధవారం రాష్ట్రాల అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. మార్గదర్శకాలు జారీ చేసింది. అందరూ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. సాధారణంగా కొవిడ్-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల ద్వారా జేఎన్.1 వేరియంట్‌ను కనిపెట్టవచ్చు. వైరస్ కట్టడికి అన్ని ప్రభుత్వాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్, సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. వారి వివరాలను ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసి కేసుల పెరుగుదలను తొలి దశలోనే పసిగట్టాలి. ఆర్‌టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి.
మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు
జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి మిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్1 లక్షణాలు. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.. గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం తప్పనిసరిగా పాటించాలి. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.