తెలంగాణలో జెండా పాతేందుకు బీజేపీ హైకమాండ్ ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఉత్తరప్రదేశ్ లో విజయం తర్వాత ఆ పార్టీ దృష్టి అంతా.. తెలంగాణపైనే ఉందని ఇప్పటికే స్పష్టమయింది. దక్షిణాదిలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే రెండో రాష్ట్రం తెలంగాణ అవుతుందని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతూ వస్తున్నారు. అయితే ఇది ఆషామాషీగా కాదు. కష్టపడాలి. వ్యూహాలు పన్నాలి. ఆ వ్యూహాలు ప్రత్యర్థులకు అందకుండా ఉండాలి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యూహకర్తగా లక్కీ హ్యాండ్ ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. ఆయనను మించిన వ్యూహాకర్తలను పెట్టుకోవాలి. వీటన్నింటినీ బీజేపీ ఎప్పుడో పూర్తి చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో యుద్ధానికి సన్నాహాలు కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
యూపీలో బీజేపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంలో ప్రధాన కారణాల్లో ఒకటి బీజేపీ స్ట్రాటజీ టీం. అరవై మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని యూపీ ఎన్నికల కోసం బీజేపీ నియమించింది. వారంతా పక్కా ప్రొఫెషనల్స్. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని... దానికి తగ్గట్లుగా రాజకీయ సలహాలు ఇవ్వడంలో వారు ఏ మాత్రం ఆలోచించరు. వారి సూచనలతోనే ప్రధానమంత్రి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. యూపీ ఎన్నికల విజయంతో వారి మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ అరవై మంది నిపుణుల బృందాన్ని తెలంగాణకు పంపాలని బీజేపీ హైకమాండ్ డిసైడైపోయింది.
యూపీలో సేవలు అందించిన అరవై మందిస్ట్రాటజిస్టుల బృందం రేపోమాపో.., తెలంగాణకు రానుంది. అయితే వారు వచ్చిన విషయం.. పని చేస్తున్న విషయం.., బీజేపీ ముఖ్య నేతలకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వారు గోప్యంగా తమ పని చేసుకుని వెళ్తారు. కొంత మంది ఫీల్డ్ లోకి కూడా వెళ్తారు. కానీ అన్నీ రహస్యంగానే సాగిపోతాయి. రాజకీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి బీజేపీ నేతలకు స్ట్రాటజీలు .. సలహాలు ఇస్తారు. యూపీ ఎన్నికల్లో వారి సూచనలు, సలహాలు సక్సెస్ కావడంతో.. తెలంగాణలోనూ వారి హ్యాండ్ లక్కీ అవుతుందని బీజేపీ నేతలు నమ్మకంతో ఉన్నారు.
తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే స్ట్రాటజిస్టులను పెట్టుకున్నాయి. కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకుంటున్నారు. కేసీఆర్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల వెనుక పీకే సలహాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ పార్టీ హైకమాండ్ ఓ స్ట్రాటజిస్ట్‌ను కేటాయించిందని.. త్వరలోనే ఆయన పని ప్రారంభిస్తారని కూడా చెబుతున్నారు. ఇక షర్మిల పార్టీ కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ టీంలో పని చేసిన ప్రియ అనే స్ట్రాటజిస్ట్‌ను నియమించుకున్నారు. దీంతో తెలంగాణ రాజకీయ పార్టీల పోరాటం.. వ్యూహకర్తల ఆలోచనల ప్రకారం సాగే అవకాశం కనిపిస్తోంది.