BRS BC Leaders :  రాజకీయాల్లో సామాజిక సమీకరణాలే కీలకం. ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ కీలకం. అలాంటి ఓటు బ్యాంక్‌గా కొన్ని వర్గాలు పార్టీలను అంటి పెట్టుకుని ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్ కు మాత్రం తెలంగాణ వాదమే అసలైన బలం. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వతా ఆ తెలంగాణ వాదంతో ఎన్నికలకు వెళ్లి ఓట్లు పొందదడం క్లిష్టమైన విషయమే. అందుకే సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టింది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్‌కు గట్టి కౌంటర్ ఇస్తోంది. 


తెలంగాణ రాజకీయాల్లో బీసీ సమీకరణాలపై చర్చలు
 
తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. రాజకీయంగా చైతన్యవంతం అయిన బీసీలకు ఇటీవలి కాలంలో తగినన్ని సీట్లు దక్కడం లేదన్న అసంతృప్తి ఆయా వర్గాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గానికి రెండు సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. దానికి తగ్గట్లుగా కసరత్తు కూడా చేస్తోంది. బీసీ ఓటు బ్యాంక్ ని ఆకట్టుకోవడానికి చేయగలిగినంతా చేస్తోంది.  దీనికి కారణం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీసీలకు చాలా తక్కువ సీట్లు కేటాయించడమే.  కేసీఆర్ కన్నా తాము ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కాంగ్రెస్ చెప్పుకునేందుకు కేసీఆరే అవకాశం ఇచ్చినట్లయింది. 


రెడ్డి సామాజికవర్గం కన్నా బీసీలకు తక్కు సీట్లు ఇచ్చిన కేసీఆర్ 
 
టిక్కెట్ల కేటాయింపులో ఆశలు పెట్టుకున్న బీసీ నేతలకు బీఆర్ఎస్‌లో సమస్య ఎదురయింది.  సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించడంతో అదే పార్టీకి చెందిన బడుగు, బలహీన వర్గాల  నాయకులు, అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన లీడర్లు సైతం సీఎం కేసీఆర్‌ వ్యవహారశైలిపై గుస్సా అవుతున్నారు. ఎన్నికల వేళ ఈ వ్యవహారం గులాబీ పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చేదిగా ఉంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇటీవల మహిళా బిల్లును ముందుకు తెచ్చిన సంగతి విదితమే. ఆ బిల్లుకు మద్దతునిచ్చిన బీఆర్‌ఎస్‌… మరో ప్రధాన డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. చట్టసభల్లో బీసీ మహిళలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించటంతోపాటు కులగణన చేపట్టాలంటూ ఆ పార్టీ కోరుతోంది. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించ లేదనే అంశాన్ని అది ప్రస్తావిస్తోంది. ఇదే అంశంపై ఇప్పుడు రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ నేతలు బీఆర్‌ఎస్‌ను ప్రశ్నిస్తున్నారు.  ప్రస్తుత అసెంబ్లీలో అన్ని పార్టీల నుంచి 19 మందే బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. నెల క్రితం విడుదల చేసిన గులాబీ పార్టీ తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌, అందులో బీసీలకు కేవలం 23 స్థానాలనే కేటాయించారు. ఇదే సమయంలో ఓసీ సామాజిక తరగులకు మొత్తంగా 63 సీట్లను కేటాయించారు. ఇందులో రెడ్లు సగానికిపైగా సీట్లను కైవసం చేసుకున్నారు.  మిగిలిన నాలుగు స్థానాల్లో కూడా  జనగామ పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సాపూర్‌ సునీతా లక్ష్మారెడ్డితోపాటు మల్కాజ్‌గిరి నుంచి కూడా ఓసీనే బరిలోకి దించే అవకాశం ఉంది. ఓసీలకే ప్రాధాన్యతనివ్వటంపై బీసీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు శాసనమండలిలో ఉన్న 40 మంది సభ్యుల్లో అన్ని పార్టీల నుంచి కలిపి కేవలం ఆరుగురు బీసీలకే స్థానం దక్కింది. 


బీసీ జపం చేస్తున్న కాంగ్రెస్ 
   
బీఆర్ఎస్‌పై బీసీల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మల్చుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు షురూ చేసింది.  తెలంగాణ‌లో బీసీ   ఓట‌ర్లు అధికంగా ఉన్నారు. 80కిపైగా  నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపోట‌ముల‌పై వీరి ప్ర‌భావం ఎక్కువే. బీసీ ఓట‌ర్లు అధికంగా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే నియోజ‌క‌వ‌ర్గాలుకూడా ఉన్నాయి.  ఓ వైపు బీఆర్ఎస్ పెద్దగా టిక్కెట్లు ఇవ్వకపోవడంతో బీసీల‌పై కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ల కేటాయింపులో బీసీల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని ఇప్ప‌టికే ఆ పార్టీ నేత‌లు చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సీట్లు బీసీలకు కేటాయించనున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గ‌ర్జ‌న స‌భ‌లు నిర్వ‌హించేందు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే బీసీల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, బీసీల అభివృద్ధికోసం అమ‌లు చేసే ప‌థ‌కాల‌ను అమలు చేస్తామని చెబుతోంది. బీసీలకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీలను ఆకట్టుకునేలా, వారి సంక్షేమానికి ఉపయోగపడేలా పథకాలు రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తోంది.