YSRCP and BRS Family Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ రాజకీయాలు ఇప్పుడు ఒకే రకమైన వారసత్వ యుద్ధం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నా.. అగ్రనేతల కుటుంబాల్లోని అన్నాచెల్లెళ్ల మధ్య తలెత్తిన విభేదాలు పార్టీల ఉనికిని, ఉమ్మడి ఓటు బ్యాంకును ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ , తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి ఎదుర్కొంటున్న ఈ చిత్రమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం వారి వల్ల కావడం లేదు.
రక్తసంబంధం వర్సెస్ రాజకీయ పంతం
తెలుగు రాజకీయాల్లో వైఎస్సార్, కేసీఆర్ కుటుంబాలకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్న వెన్నంటి నిలిచిన చెల్లెళ్లు, ఇప్పుడు అదే అన్నలకు రాజకీయంగా సవాల్ విసురుతున్నారు. ఏపీలో వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని కాపాడితే, తెలంగాణలో ఉద్యమ సమయంలో కవిత సాంస్కృతిక సారథిగా నిలిచారు. అయితే, నేడు ఏపీలో జగన్-షర్మిల మధ్య ఆస్తుల గొడవలు, రాజకీయ విభేదాలు బహిరంగమై కోర్టుల వరకు వెళ్లగా.. తెలంగాణలో కేటీఆర్-కవిత మధ్య ఆధిపత్య పోరు .. కవిత సొంత పార్టీ దిశగా వెళ్లింది.
వారసత్వ విభేదాలు
వైసీపీలో జగన్, షర్మిల మధ్య పోరు కేవలం రాజకీయమైంది మాత్రమే కాదు, కుటుంబ ఆస్తుల పంపకాల్లో తలెత్తిన విభేదాలు కూడా దీనికి ఆజ్యం పోశాయి. తల్లి విజయమ్మ కూడా షర్మిల పక్షాన నిలబడటం పార్టీ కేడర్‌లో అయోమయాన్ని సృష్టించింది. అటు బీఆర్ఎస్‌లోనూ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం జరిగిన ప్రతిసారీ కవిత వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం, తాజాగా ఆమె కొత్త పార్టీ పెట్టబోతూండటం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే రహస్యాలు, లోపాలు రాజకీయ ప్రత్యర్థులకు బలమైన అస్త్రాలుగా మారుతున్నాయి. ఏపీలో షర్మిల చేసే విమర్శలను టీడీపీ, జనసేన తమకు అనుకూలంగా మలుచుకుంటుంటే.. తెలంగాణలో కవిత అరెస్ట్ లేదా ఆమెపై వచ్చే ఆరోపణలను కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ , ప్రస్తుత పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి వాడుకుంటున్నాయి. "ఇంటిని చక్కదిద్దుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం చక్కదిద్దుతారు అనే విమర్శలను ఈ రెండు పార్టీలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఓటు బ్యాంకు చీలిక - పార్టీలకే నష్టం
ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఒక బలమైన నాయకుడి చుట్టూ, ఆ కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. అన్నాచెల్లెళ్లు విడిపోవడం వల్ల ఆ కుటుంబానికి ఉన్న సింపతీ ఓటు బ్యాంకు రెండుగా చీలిపోతుంది. ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు జగన్, షర్మిల మధ్య నలిగిపోతుంటే.. తెలంగాణలో కేసీఆర్ వారసులుగా కేటీఆర్, కవితలో ఎవరిని నమ్మాలో తెలియక కేడర్ నిరాశలో ఉంది. ఈ చీలిక అంతిమంగా అధికార పక్షాలకు వరంగా మారుతోంది. నేతల మధ్య గొడవలు కేవలం పైస్థాయిలోనే ఉండవు, అవి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు చేరుతాయి. వారసత్వ పోరు ఎప్పుడూ ప్రాంతీయ పార్టీల బలహీనతకే దారితీసింది. అన్నాచెల్లెళ్ల ఈ సవాళ్లు సద్దుమణగకపోతే.. రెండు రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్, వైసీపీలు తమ ఉనికిని కాపాడుకోవడం కష్టతరమే. కుటుంబాల్లోని చిచ్చు.. రాజకీయంగా ప్రత్యర్థులకు పెరటిలో పండగలా మారుతుందనడంలో సందేహం లేదు.
