Kalvakuntla Family politics: తెలంగాణ రాజకీయాల్లో పవర్ ఫుల్ కల్వకుంట్ల ఫ్యామిలీ. అయితే ఇటీవలి కాలంలో ఆ కుటుంబంలో   తలెత్తిన రాజకీయ విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.  ఒకప్పుడు ఉద్యమ ప్రస్థానంలో, అధికారంలోనూ కలిసి నడిచిన అన్నచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. కవిత కొత్త పార్టీ  ప్రకటించడానికి సమయం దగ్గర పడటం.., దానికి కేటీఆర్ స్పందించిన తీరుపై  ఆ కుటుంబంలో బయటకు తెలియని రాజకీయ యుద్ధం ఏదో జరిగిందని భావిస్తున్నారు.

Continues below advertisement

కేటీఆర్ పరోక్ష బాణాలు - తల్లిదండ్రులను ఏడిపించకూడదు! క్యాతనపల్లిలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించాయి. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా  అంటూనే, తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు.. కానీ వారిని ఏడిపించకూడదు  అని ఆయన అన్నారు. ఇది నేరుగా కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే. కవిత తన సొంత రాజకీయ అజెండాతో, ముఖ్యంగా కేసీఆర్ నిర్మించిన పార్టీకి వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా తండ్రిని మానసిక వేదనకు గురిచేస్తున్నారని కేటీఆర్ భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

కవిత ఆవేదన -  నన్ను దూరం పెట్టారు!

Continues below advertisement

మరోవైపు, కవిత  ఆవేదన మరోలా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని, ముఖ్యంగా లిక్కర్ స్కామ్ వివాదం తర్వాత తనను పార్టీ కార్యకలాపాలకు దూరం పెట్టారని ఆమె చెబుతూవస్తున్నారు.  తాను పార్టీ కోసం ఎంతో చేశాను, కానీ కష్టకాలంలో నన్ను ఒంటరిని చేశారు అనే భావన ఆమెలో బలంగా ఉంది. అందుకే, తన ఉనికిని చాటుకోవడానికి, తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడానికి TRS  పేరుతో కొత్త ప్రయాణాన్ని ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ మౌనం - బాధాకరమైన పరిణామం

తల్లిదండ్రుల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటున్నారు. తన ఇద్దరు బిడ్డల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు చూసి కేసీఆర్ లోలోపల బాధపడుతున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఒకవైపు తన వారసుడిగా కేటీఆర్‌ను నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తుంటే, మరోవైపు తన కూతురు తిరుగుబాటు జెండా ఎగురవేయడం కేసీఆర్‌కు మింగుడుపడని విషయమే. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను ఏడిపించకూడదు  అనే మాట ద్వారా కవితకు కేటీఆర్ ఒక ఎమోషనల్ వార్నింగ్ ఇచ్చారని  అంటున్నారు. 

వారసత్వ యుద్ధం -  T  ఎవరిది?

కేటీఆర్ ఉద్దేశం ప్రకారం.. కవిత తన స్వతంత్ర నిర్ణయాల ద్వారా కేసీఆర్ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కవిత వాదన ప్రకారం.. కేటీఆర్ తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేలా పరిస్థితులు సృష్టించారు. ఈ అన్నచెల్లెళ్ల మధ్య బ్రాండ్  యుద్ధం కూడా నడుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను ఎవరు ఎక్కువగా ప్రతిబింబిస్తారు? అనే అంశంపై ఇద్దరూ పోటీ పడుతున్నారు. కవిత పాదయాత్రకు సిద్ధమవ్వడం, కేటీఆర్ దాన్ని లైట్ తీసుకోవడం చూస్తుంటే కుటుంబంలో అగాధం ఎంత పెరిగిందో అర్థమవుతోంది.

కుటుంబం ఏకతాటిపై ఉంటేనే బలం

కుటుంబంలో మొదలైన ఈ చిచ్చు పార్టీ మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేటీఆర్ తండ్రి బాధపడుతున్నారన్న   క్రమంలో కవితను విమర్శిస్తుంటే, కవిత తన ఆత్మగౌరవం సొంత రాజకీయ పార్టీ పెడుతున్నారు. ప్రజలు ఈ డ్రామాను గమనిస్తున్నారని, ఇది అంతిమంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు బలమైన అస్త్రంగా మారుతుందని  అభిప్రాయం వినిపిస్తోంది.  రాజకీయాల్లో సెంటిమెంట్ కంటే గెలుపే ముఖ్యం. కానీ ఇక్కడ కుటుంబ బంధాలు, రాజకీయ ప్రయోజనాలు పెనవేసుకుపోయాయి. కవిత తన ఆవేదనతో ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంటే, కేటీఆర్ మాత్రం ఆమె చర్యలు తల్లిదండ్రులకు శాపంగా మారతాయని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో లేదా ఈ చీలిక గులాబీ పార్టీని ఏ తీరానికి చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి.