Revanth Plan: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని అంతా భావించినప్పటికీ, అనూహ్యంగా ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు  చేతుల మీదుగా విడుదల చేయించారు. ఇలా చేయడం వెనుక ఆసక్తికరమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన సీనియర్ నేత కేశవరావుకు సముచిత గౌరవం కల్పించడం రేవంత్ రెడ్డి ప్రాథమిక వ్యూహంగా కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ సొంత గూటికి చేరిన కేకేకు, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉందని చాటిచెప్పడానికి ఇదొక చక్కని వేదిక. కీలకమైన విద్యాశాఖ ఫలితాలను ఆయన ద్వారా విడుదల చేయించడం ద్వారా, పార్టీలోని పాత తరం నేతలను ముఖ్యమంత్రి గౌరవిస్తారనే సంకేతాన్ని కేడర్‌కు పంపారని అంటున్నారు. 

Continues below advertisement

కేకే నేతృత్వంలోనే విద్యారంగంలో సంస్కరణలు

ఇటీవలే రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ తన నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ పర్యవేక్షణలో కేకే కీలక పాత్ర పోషించారు. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై ఆయనకు ఉన్న లోతైన అవగాహనను దృష్టిలో ఉంచుకుని, ఫలితాల విడుదల సమయంలోనే విద్యా సంస్కరణల గురించి మాట్లాడే అవకాశం ఆయనకు కల్పించారు. దీనివల్ల ప్రభుత్వ నిర్ణయాలకు ఒక  అనుభవజ్ఞుడైన మేధావి మద్దతు ఉందనే ముద్ర పడుతుందని అంచనా  వేశారు. 

Continues below advertisement

విమర్శల నుంచి రక్షణ కవచం

గతంలో ఇంటర్ ఫలితాల విషయంలో తలెత్తిన సాంకేతిక లోపాలు, విద్యార్థుల ఆత్మహత్యల వంటి ఉదంతాలు అప్పటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు కూడా విద్యాశాఖ బాధ్యతలు నేరుగా ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో, ఏవైనా చిన్న లోపాలు జరిగినా విమర్శలు నేరుగా రేవంత్ రెడ్డిపైకి వచ్చే అవకాశం ఉంది. అనుభవజ్ఞుడైన కేకేను ముందుంచడం ద్వారా, ఫలితాల ప్రక్రియను అత్యంత పారదర్శకగా, వివాదరహితంగా నిర్వహించామని ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు.  ప్రస్తుతం తెలంగాణలో పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరు. విద్యాశాఖ సిఎం వద్దే ఉన్నప్పటికీ, పాలనాపరమైన బిజీలో ఆయన అన్ని కార్యక్రమాలకు హాజరుకావడం కష్టం. అటువంటి సమయంలో కేవలం అధికారులకే బాధ్యత వదలకుండా, ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉన్న రాజకీయ నేతను భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యాశాఖపై ప్రభుత్వ పర్యవేక్షణ కొనసాగుతోందని నిరూపించారని అంటున్నారు. 

బీసీ నేతగా ప్రాముఖ్యత

రాజకీయంగా కేకే ఒక బలమైన బీసీ సామాజిక వర్గ నేత. కీలకమైన కార్యక్రమాల్లో ఆయనను ఫోకస్ చేయడం ద్వారా బీసీ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉందనే భావనను కల్పించవచ్చు. ముఖ్యంగా పాలనలో సీనియర్ల సలహాలను తీసుకుంటున్నానని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి తన వన్ మ్యాన్ షో  ఇమేజ్‌ను మార్చుకుని, సామూహిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.  కేకేతో ఇంటర్ ఫలితాలను విడుదల చేయించడం అనేది ఒకే దెబ్బకు రెండు పిట్టలు లాంటి వ్యూహం. ఒకవైపు కేకే గౌరవాన్ని కాపాడటం, మరోవైపు విద్యాశాఖలో జరుగుతున్న సంస్కరణలకు ఒక అనుభవజ్ఞుడి ముఖాన్ని జోడించడం ద్వారా రేవంత్ రెడ్డి తన పరిణతి చెందిన రాజకీయ శైలిని ప్రదర్శించారని అనుకోవచ్చు.