Bandi Sanjay: ‘తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి  దృఢ సంకల్పంతో మీరు చేస్తున్న  కృషిని అధిష్టానం ఎందుకు గుర్తించలేదో నాకు అర్థమైతలేదు.  కష్టపడి పనిచేసి  గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీని మీరు తీసుకుపోయిండ్రన్న.. కానీ కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు లేదని నాకు అర్థమైపోయిందన్న..’ అంటూ బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించడంపై శుక్రవారం విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ అభిమాని ఆవేదన ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన  బీజేపీ నాయకుడు సొల్లు అజయ్ వర్మ ఓ వీడియోను విడుదల చేసి మరి ఆత్మహత్యకు  పాల్పడటం సంచలనం సృష్టించింది. బండిని తప్పించడంతో కరీంనగర్ ఎంపీ భవిష్యత్ ఏంటోనని  ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. 


నిలబెట్టినోడినే పడగొట్టి.. 


2014లో ‘మోడీ వేవ్’ దేశమంతా వీచినా తెలంగాణలో మాత్రం  ‘కారు హవా’ సాగింది.  2018 అసెంబ్లీ ఎన్నికలలోనూ అదే సీన్ రిపీట్ అయింది. అయితే కొద్దిగ్యాప్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం బీజేపీ అనూహ్యంగా తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ పార్టీకి ‘ఎదగడానికి’ అవకాశాలున్నాయన్న సంగతి అధిష్టానానికి బోధపడింది. 2019లో బీజేపీ హైకమాండ్.. నాటి చీఫ్ లక్ష్మణ్‌ను తప్పించి కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించింది. ‘వీధి పోరాటాలు చెయ్.. నీకు మేం అండగా ఉంటాం’ అని హామీ ఇచ్చింది. హైకమాండ్ అంచనాలను  సంజయ్ ఎన్నడూ వమ్ము చేయలేదు.  అప్పటివరకూ తెలంగాణలో సోషల్ మీడియాకే పరిమితమైన బీజేపీని.. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సంజయ్ పాత్ర మరువలేనిది.   తెలంగాణ రాష్ట్ర సర్కారుపైనా ఆయన రాజీలేని పోరాటం చేశారు. ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో ‘సిటీ పార్టీ’ని  గ్రామస్థాయికీ తీసుకెళ్లారు. ఒక దశలో బీఆర్ఎస్‌కు ఆయన  కొరకరాని కొయ్యగా  మారారు. ఇంత చేసినా  బీజేపీ అధిష్టానం మాత్రం సంజయ్‌ను సాగనంపింది. రాష్ట్రంలో  ‘బీజేపీ గెలవగలదు’ అని కార్యకర్తల్లో నమ్మకం కలిగించిన నాయకుడిని కూరలో కరివేపాకు తీసిపారేసినట్టు  పక్కనబెట్టారని రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.  


 






అభిమానుల ఆవేదన.. 


సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించగానే ఖమ్మంలో ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు.  కరీంనగర్‌లో చాలా మంది  ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఈ పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో కూడా ఆయన అభిమానులు చాలామంది ‘మా అన్న ఏం తప్పు చేశాడని తీసేశారు’ అనేది అర్థం కాక ఆవేదనలో ఉన్నారు. బయటకు చెప్పేవాళ్లు కొంతమంది అయితే.. చెబితే వ్యతిరేకవర్గం కింద లెక్కేస్తారో అనే లోలోపలే మదనపడే వాళ్లూ  ఉన్నారు. 


ఏం చేస్తారో..? 


రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత సంజయ్ భవితవ్యమేంటి..? అన్నది  అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కేంద్ర మంత్రి వర్గంలోకి సంజయ్‌ను తీసుకుంటారని ప్రచారం జరిగినా దానిమీద స్పష్టత లేదు. జాతీయ స్థాయిలో కీలక స్థానాన్ని కల్పిస్తారని  వార్తలు వస్తున్నా అలా చేస్తే స్థానిక కార్యకర్తలకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తీసుకున్నా అది కూడా కార్యకర్తలతో మమేకమయ్యే పదవి కాదు. 


ఎమ్మెల్యేగా ఎక్కడ్నుంచి..? 


సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నుంచి  ప్రాతినిథ్యం వహిస్తున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన కరీంనగర్ లేదా వేములవాడ నుంచి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  2018లో ఆయన ప్రస్తుత మంత్రి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. ఆ సింపతీతోనే పార్లమెంట్‌లో గెలిచారు. ఇప్పుడు కూడా ‘సింపతీ  సెంటిమెంట్’ రిపీట్ అయితే  ఆయనను తెలంగాణ అసెంబ్లీలో చూడొచ్చనేది  ఆయన అభిమానుల  ఆశ. కానీ కరీంనగర్‌లో ఆయన గెలుపు అంత ఈజీ కూడా కాదు. 60వేల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లింలు ‘కీ రోల్’ పోషిస్తారు. సుమారు ఇక్కడ 25వేలకు పైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికలలో ఇవి గంపగుత్తగా గంగులకే పడ్డా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  ఇది బండికి లాభించేదే.  మరి అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినప్పట్నుంచి ఇప్పటివరకూ కరీంనగర్‌కు వెళ్లని సంజయ్ భవిష్యత్  ఏంటనేది  రాష్ట్ర బీజేపీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.