Telangana Politics Bandi Bhagirath Case: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు కేవలం ఒక నేరపూరిత దర్యాప్తుగా మిగలకుండా, రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టిస్తోంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో బండి భగీరథ్ పరారీ అంటూ వెలిసిన పోస్టర్లు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. అసలు ఈ పోస్టర్లు ఎవరు వేశారు? దీని వెనుక ఉన్న రాజకీయ శక్తులు ఏవి? అన్నది పక్కన పెడితే, ప్రత్యర్థిని దెబ్బతీయడానికి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రాజకీయంగా హైపర్ యాక్టివ్ ఈ వ్యవహారం రెండు భిన్నమైన కథనాల మధ్య నలుగుతోంది. ఒక వైపు, ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని ప్రాసిక్యూషన్ చెబుతోంది. మరోవైపు, ఇది పక్కాగా ప్లాన్ చేసిన హనీ ట్రాప్ అని, రూ. 5 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని భగీరథ్ తరపున కౌంటర్ ఫిర్యాదు నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉండగా, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ ఈ కేసులో అసలు బాధితులు ఎవరో తేల్చలేనంత గందరగోళాన్ని సృష్టిస్తోంది.
సాధారణంగా ఏదైనా కేసు నమోదైనప్పుడు దర్యాప్తుకు సహకరించాల్సిన బాధ్యత నిందితులపై ఉంటుంది. అయితే, బుధవారం సిట్ విచారణకు భగీరథ్ హాజరుకాలేదు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తయిన తర్వాత వచ్చేలా రెండు రోజుల తరవాత వస్తానని సమాచారం పంపారు. బండి సంజయ్ రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే తన కుమారుడిని బలి చేస్తున్నారని, ఇది తనపై జరుగుతున్న పొలిటికల్ హిట్ జాబ్ అని ఆరోపిస్తున్నారు. అధికార పక్షం మాత్రం.. నేరం చేసింది ఎవరైనా చట్టం ముందు సమానమేనని, బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మరో వైపు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలంటున్నారు.
నలిగిపోతున్న బాధితురాలి కుటుంబం
ఈ రాజకీయ యుద్ధంలో బాధితురాలి కుటుంబానికే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకునే క్రమంలో, బాధితురాలి గుర్తింపును గానీ, ఆమె మానసిక స్థితిని గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఈ సమస్యను పరిష్కరించడానికి వివాహం వంటి వింత సలహాలు ఇవ్వడం, దానికి టీపీసీసీ ఖండన తెలపడం వంటివి చూస్తుంటే.. ఈ అంశం ఎంతటి అయోమయానికి గురైందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో నేతలను వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి వారి పిల్లలను, కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి పెరిగిపోవడం ఆందోళనకరమన్న అభిప్రాయం వినిపిస్తోంది. అది భగీరథ్ అయినా, మరెవరైనా.. నేరం నిరూపితమైతే చట్టపరమైన శిక్ష అనుభవించాలి. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే పోస్టర్లతో వేధించడం , రాజకీయ కుట్రలంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. చివరకు కోర్టులో తేలాల్సిన అంశాన్ని వీధి పోరాటంగా మార్చడం వల్ల వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళనవ వ్యక్తమవుతోంది.
