Bandi Sanjay Son Bandi Bhagirath Case | హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తక్షణం విచారణ చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేసు నమోదైనప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని డీజీపీని ప్రశ్నించారు. ఈ క్రమంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై స్పెషల్ టీం ఏర్పాటు చేసి తక్షణమే విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్‌ను సోమవారం నాడు ఆదేశించారు.
ఈనెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ, నిందితుడు బండి భగీరథ్2పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం జరిగిందని డీజీపీని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో బిజీగా ఉండటం వల్ల విచారణలో కొంత జాప్యం జరిగిందని సీఎంకు డీజీపీ వివరించారు. ఈ కేసులో ఎలాంటి జాప్యం లేకుండా సమగ్ర దర్యాప్తు జరిపించాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బండి భగీరథ్ పై పోక్సో కేసు..కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఒక మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. బాధిత బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆ ఘటనకు సంబంధించిన అంశాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి తరపు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయనున్నారు.
పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
తన కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ బాలిక (17) తల్లి ఫిర్యాదు చేశారు. దాంతో పేట్‌బషీరాబాద్ పోలీసులు సెక్షన్ 11 రెడ్‌విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్, బీఎన్‌ఎస్ 74, 75 సెక్షన్ల కింద మే 8న రాత్రి బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేశారు. మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌజ్‌తోపాటు మరో రెండు ప్రాంతాల్లో బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు కేంద్రమంత్రి కుమారుడు కావడంతో కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకడుకు వేశారని.. మోదీ సభ జరుగుతుంటే సజీవ దహనం చేసుకుంటామని హెచ్చరిస్తే ఎట్టకేలకు కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు.
హనీట్రాప్ ఆరోపణలు.. బండి ఫిర్యాదుతో కేసు నమోదుబండి భగీరథ్ తనపై నమోదైన కేసును హనీ ట్రాప్ గా పేర్కొంటూ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్నేహం పేరుతో పరిచయమై, తనను పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులతో కలిసి ఒత్తిడి తెచ్చిందని బండి భగీరథ్ సన్నిహితులు తెలిపారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, తప్పుడు ఆరోపణలతో క్రిమినల్ కేసులు పెడతామని తనను బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కరీంనగర్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. తాను జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అనే వ్యక్తిని.. మోదీ శిష్యుడినని.. ఎలాంటి తప్పు చేయలేదని ప్రధాని మోదీ సభలో అన్నారు.
