Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్టు అనగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టుగా చర్చల్లో నలుగుతోంది. అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బకొట్టే రాజకీయాస్త్రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు విషయంలో తమ వైఖరిపై కుండబద్దలు కొట్టినట్లు వ్యవహరిస్తున్నాయో, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా అదే పట్టుదలతో వ్యవహారం నడుపుతున్నాయి. ఈ ప్రాజెక్టు అటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి మధ్య, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతర్గతంగా రాజకీయ దుమారం రేపుతోన్న బనకచర్ల ప్రాజెక్టును రాజకీయంగా ఎలా ఉపయోగపడుతుందా అన్న కోణంలోనే నేతలు ఆలోచన ఉన్నట్టు స్పష్టమవుతోంది.
బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ఇదేనా!
బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి, ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టంగా అభివర్ణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అని పదే పదే చెబుతున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన ద్రోహంగా చిత్రీకరించి, ప్రజల్లో కేసీఆర్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం ఆరోపణలే కాకుండా, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నాటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో గోదావరి జలాలపై రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. 2017, 2019లో జరిగిన సమావేశాలను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించడానికి అంగీకరించారన్నది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఇది తెలంగాణ ప్రయోజనాలను కాలరాయడమే కాకుండా, తెలంగాణను వెన్నుపోటు పొడవడమే అని కేసీఆర్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ద్రోహిగా కేసీఆర్‌ను చిత్రీకరించి రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంతో రేవంత్ ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ పరిరక్షకుడిని తానే అంటున్న రేవంత్
బనకచర్ల ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నట్లు బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే గోదావరి జలాలు తరలింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. గతంలో ఓ మాట, ఇప్పుడు ఓ మాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా, ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు అనుమతులు రాకుండా చూస్తామని ప్రకటించారు. టెక్నికల్‌గా, పొలిటికల్‌గా, లీగల్‌గా అడ్డుకుంటామని చెబుతున్నారు. తద్వారా తెలంగాణ పరిరక్షకుడిని తానేనని రేవంత్ రెడ్డి చెప్పకనే చెబుతున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా తాను తెలంగాణ పరిరక్షకుడిగా, కేసీఆర్‌ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించడమన్నది రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగమని చెప్పవచ్చు.
బీజేపీనీ వదలని రేవంత్ రెడ్డి
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందాన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తమ ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూనే, అటు జాతీయ స్థాయిలో బీజేపీని కూడా ఈ ప్రాజెక్టు విషయంలో దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అడ్డుకునే విషయంలో అఖిలపక్ష సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానిస్తే హాజరు కాలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. ఈ సమావేశం జరుగుతున్నప్పుడే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను రహస్యంగా కలవడం వెనుక మతలబేంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు కిషన్ రెడ్డి ఆటంకంగా మారారన్న విమర్శలు చేశారు. మోదీ-చంద్రబాబు బంధం కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి ఆంధ్రాకు వత్తాసు పలుకుతున్నట్లు రేవంత్ విమర్శలు చేశారు. తద్వారా బీజేపీ కూడా తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేయడం గమనార్హం.
బనకచర్ల ప్రాజెక్టుతో జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంలో సీఎం చంద్రబాబు
తెలంగాణలో బనకచర్ల ప్రాజెక్టు రాజకీయ మంటలు రేపుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రాజెక్టు రాజకీయాస్త్రంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ సస్యశ్యామలంగా మారుతుందని చెబుతోన్న చంద్రబాబు, తానే రాయలసీమ పరిరక్షకుడిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత వై.ఎస్. జగన్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం వహించిందని చంద్రబాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు పొందే విషయంలో జగన్ ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించారన్నది ప్రధాన ఆరోపణ. జగన్ ఐదేళ్ల పాలనలో రాయలసీమ ప్రయోజనాలను విస్మరించారని చెబుతున్నారు. జగన్ తన సొంత జిల్లా కడపకే ఏం చేయలేనిది, రాయలసీమ ప్రాంతానికి ఏం చేస్తారన్నది చంద్రబాబు ప్రశ్న. తద్వారా జగన్ రాయలసీమకు ద్రోహిగా జగన్‌ను ఎత్తిచూపే ప్రయత్నాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రారంభించారు. తమ ప్రభుత్వం రాగానే రాయలసీమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో దూకుడుగా తాము ముందుకు వెళుతున్నామనే సంకేతాలు ఇచ్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ప్రయోజనాలు ఇవే
1.తాము అధికారం చేపట్టగానే తెలంగాణ ప్రయోజనాలను రక్షించేందుకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకే బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరతామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకుని రాజకీయంగా ప్రజల మన్ననలు పొందే అవకాశం కలిగింది.
2. అధికారంలో ఉన్నప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపి కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను కాలరాసే పద్ధతిలో వ్యవహరించారని, తెలంగాణ వ్యతిరేకిగా అభివర్ణించే అవకాశం ఈ ప్రాజెక్టు కల్పించింది. కేసీఆర్‌తో ఉన్న స్నేహ బంధం వల్లే జగన్ రాయలసీమ ప్రయోజనాలు మరిచిపోయి, ఈ ప్రాజెక్టు కట్టే విషయంలో అలసత్వం ప్రదర్శించారని, రాయలసీమ ద్రోహిగా జగన్‌ను చిత్రీకరించే అవకాశం చంద్రబాబుకు ఈ ప్రాజెక్టు కల్పించింది.
3. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తమ రాష్ట్రాల్లో సెంటిమెంట్ రేపే ఉత్ప్రేరకంగా బనకచర్ల ప్రాజెక్టు మారింది. ప్రాంతీయ సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఇరు రాష్ట్రాల సీఎంలకు కలగడానికి కారణం బనకచర్ల ప్రాజెక్టే.
4. బనకచర్ల ప్రాజెక్టుపై నిరంతరం చర్చ పెట్టడం ద్వారా అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలపై ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేసే అవకాశం కల్పించిందీ ప్రాజెక్టు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ప్రజలను తమ వైపు తిప్పుకునే అవకాశం ఈ ప్రాజెక్టు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు అవకాశం కల్పించిందనడంలో సందేహం లేదు.
5. బనకచర్ల ప్రాజెక్టును రెండు రాష్ట్రాల సీఎంలు ప్రధాన రాజకీయ అంశంగా మార్చడం ద్వారా రాజకీయ అజెండాను వారే డిసైడ్ చేస్తున్నారు. ఈ ఉచ్చులో ప్రతిపక్షాలు పడిపోవడం వల్ల పాలనా వైఫల్యాలు, హామీల అమలు వంటివి చర్చకు రాకుండా చూసే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం కల్పించిందీ బనకచర్ల ప్రాజెక్టు. ఓ రకంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి పడవేసేలా చేసిందీ బనకచర్ల.