Balineni Srinivasa Reddy To Join in the Janasena party : వైఎస్ఆర్‌సీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జంప్ అవుతున్నారు. తాజాగా జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేపోమాపో ఆయన అధికారిక ప్రకటన చేయనున్నట్లుగా చెబుతున్నారు. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నారు. కనీసం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని ఇంత కాలం చెబుతూ వస్తున్నారు. తాను ఈవీఎంలపై చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడం లేదని కూడా గతంలో పార్టీపై అసంతృృప్తి వ్యక్తం చేశారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు జగన్ పిలిచి మాట్లాడారు. గురువారం తాడేపల్లిలో జగన్ ను బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. దీంతో జగన్ బాలినేని బుజ్జగిస్తారని ఆయనను పార్టీ మారకుండా ఒప్పిస్తారని అనుకున్నారు. అయితే బాలినేనికి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇవ్వాల్సిన గుర్తింపు, పదవి.. విషయంలో జగన్ ఏమీ చెప్పకపోవడం.. జిల్లాపై తిరుపతి నేత చెవిరెడ్డి ప్రకాష్ రెడ్డి పెద్దరికం ఉంటుందని స్పష్టం చేయడంలో బాలినేని అసంతృప్తితో బయటకు వచ్చారని చెబుతున్నారు. జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత బాలినేని పార్టీ మారుతారన్న ప్రచారం ఇంకా ఊపందుకుంది.
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
వైసీపీ తరపున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో యర్రగొండ పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఒకరు. ఆయన బాలినేనికి సన్నిహితుడు. ఆయన సిఫారసు ద్వారానే సిట్టింగ్ గా ఉన్న మంత్రి ఆదిమూలం సురేష్ ను తప్పించి .. తాటిపర్తికి టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు బాలినేని పార్టీ మారిపోతే ఆయన కూడా వెళ్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఆఫీసు నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ కు పిలుపు వచ్చింది . జగన్ ఆయనతో మాట్లాడి.. పార్టీకి విధేయంగా ఉండాలని.. బాలినేనితో కలిసి నడవవొద్దని చెబుతారని అంటున్నారు.
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
బాలినేనికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. ఆయన పార్టీని చక్క బెడతారని పలువురు ప్రకాశం జిల్లా నేతలు ఇటీవలి కాలంలో జగన్ తో పాటు పార్టీ నేతల్ని కలిసి చెబుతున్నారు. అయితే అసలు బాలినేనికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరని తెలియడంతో ... ఆయనకు మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు బాలినేనిని టీడీపీలోకి రానివ్వరు. బీజేపీలో చేరలేరు. పవన్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆయన జనసేనలో చేరుతారన్న ప్రచారం ఊపందుకుంటోంది. గతంలో కూడా బాలినేనిపై ఈ ప్రచారం జరిగింది. అప్పట్లో ఖండించారు కానీ.. ఇప్పుడు ఖండించడం లేదు. తనను ఆ పార్టీలోకి వెళ్లాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు.