YSRCP Leaders Got Bail In SC: తెలుగు దేశం ఆపీస్‌పై దాడి కేసులో వైసీపీ లీడర్లు దేవినేని అవినాష్, జోగి రమేష్‌, తలశిల రఘురామ్, నందిగమ సురేష్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.  వాళ్లకు ముందస్తు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. పాస్‌పోర్టులను కూడా విచారణ అధికారులకు అప్పగించాలని సూచించింది. 


ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగమ సురేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు సబ్‌జైలులో ఉన్నారు. ఆయన్ని ఈ మధ్యే వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఆయనకి కూడా ఈ కేసులో ఊరట లభించింది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల మంజూరు చేసిన వారిలో నందిగమ సురేష్‌ ఉన్నారు. 


ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వివిధ కోర్టుల్లో వైసీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. సెప్టెంబర్ నాలుగో తేదీని ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ఏపీ హైకోర్టు వారి పిటిషన్‌లు కొట్టేసింది. దీంతో వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 


ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన వేళ..సుప్రీకోర్టుకు వెళ్లే వరకైనా పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా రిక్వస్ట్ పెట్టారు. కానీ కోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. అప్పటికే తీర్పు వెల్లడించేసినందున ఇకపై తీర్పులో మార్పులు చేర్పులు చేయడం కుదరదని చెప్పేసింది. 


కోర్టులో ప్రతికూల నిర్ణయం రావడంతో వెంటనే దాడి కేసులో నిందితులుగా ఉన్న వారంతా అజ్ఞాతంలోకి వెళ్లోపోయారు. వారి సెల్‌ఫోన్‌లు కూడాస్విచ్ఛాఫ్ చేసి పెట్టారు. వీళ్ల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన పోలీసులు శాఖ ఒక్కొక్కరి ఆచూకీ గుర్తించే పనిలో పడింది. 


ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో తలదాచుకుంటున్న వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్‌ ను అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో వైసీపీ లీడర్‌ను కూడా అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్న వేళ సుప్రీంకోర్టు వారికి ఊరట ఇస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఏ క్షణమైనా నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 


మరో కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కూడా ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నారు. చంద్రబాబు ఇంటిపైకి దండెత్తారు. ఈ కేసులో జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు ఖాయమని భావించిన జోగి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయనకి కడా సుప్రీం కూడా బెయిల్ మంజూరు చేసింది.