AP BJP New Team :    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి బలముందని ఎవరూ అనుకోరు కానీ.. బీజేపీ చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి.  ఆ పార్టీతో సన్నిహిత సంబంధాల కోసం వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ పోటీ పడుతూంటాయి.అయితే ఈ సంబంధాలు ఢిల్లీ స్థాయిలోనే . రాష్ట్రానికి వచ్చే సరికి ఆ పార్టీ ని.. ఆ పార్టీ నేతల్ని కలుపుకుని పోయేందుకు ఏ ఒక్క పార్టీ ప్రయత్నించవు. బీజేపీ నేతలు కూడా రెండు పార్టీల నేతలు ఢిల్లీలో తమ హైకమాండ్‌తో సన్నిహితంగా ఉన్నారు కదా అని ఆయా పార్టీలతో కలిసిపోయే  ప్రయత్నం చేయలేదు. అయితే రెండు పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉండటం.. బీజేపీ ఎదగలేకపోతోంది. జాతీయ రాజకీయాల కోసం హైకమాండ్ కూడా ఏపీ రాజకీయాలను అదే కోణంలో ట్రీట్ చేస్తోంది. 


జాతీయ రాజకీయాల  కోణంలోనే ఏపీ బీజేపీలో మార్పుచేర్పులు


దేశంలోకెల్లా బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న  రాష్ట్రం ఏపీ. ఒక్క శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. ఒకప్పుడు పది శాతం వరకూ ఉన్న ఓటు బ్యాంక్..  ప్రత్యక్ష పొత్తులు.. పరోక్ష సహకారాల కారణంగా పడిపోయింది. ఇప్పుడు బీజేపీ సానుభూతిపరులు కూడా పొత్తులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి ఓటు వేయడం లేదు. బీజేపీ, వైసీపీ ఒకటేనని జరిగిన ప్రచారంతో గత ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ వైసీపీకి మళ్లిందన్న విశ్లేషణలు ఉన్నాయి.  బీజేపీ బరిలో ఉన్నా. వారికి ఒక్క శాతం తక్కువ ఓట్లు రావడమే దీనికి నిదర్శనం. బీజేపీ హైకమాండ్ కూడా.. జాతీయ రాజకీయాల కోణంలోనే రాష్ట్ర నాయకత్వాల్లో మార్పులు చేర్పులు చేస్తూ వస్తోంది. 


ప్రభుత్వంపై పోరాడుతున్నా కన్నాను హఠాత్తుగా తప్పించడంతో బీజేపీకి చిక్కులు !


ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కన్నా లక్ష్మినారాయణ  ఏపీ బీజేపీ చీఫ్ గా ఉండేవారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడేవారు. ఆయనపై విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ నేతలు ..బీజేపీ అంతర్గత విషయాలను ప్రస్తావించి ఎదురుదాడి చేసేవారు. ఎన్నికల నిధుల్ని కన్నా లక్ష్మినారాయణ దుర్వినియోగం చేశారని చెప్పేవారు. బీజేపీ ఎన్నికల నిధుల ఖర్చులు.. విజయసాయిరెడ్డికి ఎలా తెలిశాయన్న సంగతి పక్కన పెడితే... అనూహ్యంగా కన్నా ను తప్పించి సోము వీర్రాజును చీఫ్ గా చేశారు. అప్పట్నుంచి బీజేపీ .. వైసీపీకి అనుకూలం అన్నట్లుగా మారిపోయింది. దీంతో బీజేపీ ఎదగుదల ఆగిపోయింది. 


పురందేశ్వరి నియామకంతో మళ్లీ మారిన సీన్


ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో సోము వీర్రాజును కూడా తప్పించి.. అనూహ్యంగా పురందేశ్వరికి చాన్సిచ్చారు. పురందేశ్వరి రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. కానీ ఆమెను చీఫ్గా చేయడంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తుల సమీకరణాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కార్యవర్గంలో కూడా వైసీపీకి అనుకూలం అనుకున్న వారందర్నీ పక్కన పెట్టేశారు. ఊరూపేరూ లేని వారయినా .. చాలా మందికి చోటిచ్చారు. ప్రజల్లో చురుకుగా తిరగలేకపోయినా.. కనీసం మీడియాలో పార్టీ వాయిస్ వినిపించలేకపోయినా వారికి ప్రధాన కార్యదర్శుల పదవులు ఇచ్చారు. హైకమాండ్ మద్దతుతోనే ఇదంతా  జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 


ప్రస్తుతం బీజేపీలో చేస్తున్న మార్పులు చూస్తే ఒంటరిగా పోరాడే యోచన లేదని..  పొత్తుల సమీకరణాల్లో భాగంగానే మార్పులు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.